One more Pakistan conspiracy: మతాల మధ్య విద్వేషాలు సృష్టించే పాకిస్తాన్ పన్నాగం మరోసారి బట్టబయలైంది. సిక్కులు అత్యంత పవిత్రంగా భావించే కర్తార్ పూర్ గురుద్వారా నిర్వహణ బాధ్యతలను ఐఎస్ఐ కనుసన్నలలో పని చేసే నాన్ సిక్కు సంస్థ ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ఈటీపీబీ)కి అప్పగిస్తూ పాకిస్తాన్ సెంట్రల్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై భారత దేశంలోని సిక్కుల ప్రతినిధులు తీవ్రంగా మండిపడుతున్నారు.
గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తారపూర్ నిర్వహణ బాధ్యతలను గతంలో పాకిస్తాన్ గురుద్వారా కమిటీ చూసుకునేది. తాజాగా కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఐఎస్ఐ కనుసన్నలలో పని చేసే నాన్ సిక్కు సంస్థ ఈటీపీబీకి కర్తార్ పూర్ గురుద్వారా నిర్వహణకు అప్పగించారని ఢిల్లీ సిఖ్ గురుద్వారా మేనేజ్‌మెంటు కమిటీ అధ్యక్షుడు మంజీందర్ సింగ్ సిర్సా తెలిపారు.
పాకిస్తాన్ సిఖ్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఆదేశంలోని మైనారిటీ సిఖ్ కమిషన్ ఆధ్వర్యంలో పని చేసేది. సిక్కుల మనోభావాలను ప్రతినిధిగా వ్యవహరించేది. కానీ దానిని మారుస్తూ నాన్ సిక్కు సంస్థ ఈటీపీబీకి గురుద్వారా నిర్వహణ బాధ్యతలను అప్పగించడాన్ని మంజీందర్ సింగ్ సిర్సా తప్పుపడుతున్నారు. భారత దేశం నుంచి ప్రతీ ఏటా వేలాది మంది సిక్కులు కర్తార్ పూర్ గురుద్వారా సందర్శనకు వెళుతూ వుంటారు. వీరిపై నిఘా పెట్టేందుకే ఐఎస్ఐకు అనుబంధంగా పనిచేసే ఈటీపీబీకి గురుద్వారా నిర్వహణ బాధ్యతలను అప్పగించినట్లు మంజీందర్ సింగ్ సిర్సా అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా వుండగా నాన్ సిక్కు సంస్థకు కర్తార్ పూర్ గురుద్వారా నిర్వహణను అప్పగించడాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ కూడా తప్పుపట్టింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన విదేశాంగ శాఖ.. పాక్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నవంబర్ 9వ తేదీన కర్తార్ పూర్ కారిడార్ మొదటి దశ ప్రారంభం కాబోతున్న తరుణంలో పాక్ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
ALSO READ: భూసర్వేపై జగన్ కేబినెట్ సంచలన నిర్ణయం
ALSO READ: టీడీపీ నేతలకు ‘సుప్రీం’ నోటీసులు