Kim Jong Un: ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్యకు వ్యతిరేకంగా నాటో కూటమి నేతలు సమావేశమవుతున్న వేళ.. కిమ్ ఆధ్వరంలో నార్త్ కొరియా(North Korea) కొత్త తరహా ఖండాంతర క్షిపణి Hwasong-17 ఐసీబీఎం ను ప్రయోగించి అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసేంది. సుదూర లక్ష్యాలను సునాయాసంగా చేరుకునే ఈ ఐసీబీఎం.. అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా ఢీ కొట్టగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని రాకాసి క్షిపణిగా వారు అభివర్ణిస్తున్నారు. ఈ తాజా క్షిపణి ప్రయోగాన్ని అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నేరుగా పర్యవేక్షించినట్లు అక్కడి స్థానిక మీడియా తెలియజేసింది. దీనిని న్యూక్లియర్ వార్ ను నిరోధించేందుకు, దేశ భద్రతలో భాగంగా కిమ్ చేస్తున్న ప్రయత్నంగా అక్కడి మీడియా చెబుతోంది. రానున్న కాలంలో ఈ క్షిపణి మల్టిపుల్ వార్ హెడ్లను మోసుకుపోయే సామర్థానికి చేరుకునే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజా కవ్వింపు చర్యకు దక్షిణకొరియా ధీటుగా స్పందిస్తూ.. పలు క్షిపణులను ప్రయోగించింది. జపాన్, అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిని క్షమించరాని కవ్వింపు చర్యగా జపాన్ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉత్తరకొరియా ధిక్కరిస్తోందని అమెరికా ఆక్షేపించింది.
ఉత్తరకొరియా అమ్ములపొదిలో అత్యంత సుదూర లక్ష్యాలను చేరుకునే ఆయుధంగా దీనిని చెప్పుకోవచ్చు. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. ఈ ఏడాది అరంభం నుంచి వరుస క్షిపణి ప్రయోగాలతో దూకుడు పెంచిన నార్త్ కొరియా.. ఐసీబీఎం క్షిపణిని ప్రయోగించడం గత ఐదేళ్లతో ఇదే తొలిసారి. చివరిసారిగా 2017లో దీనిని ఆ దేశం పరీక్షించింది. దక్షిణ కొరియా సైనిక వర్గాల ప్రకారం గురువారం ప్రయోగించిన క్షిపణి 1,080 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ సముద్ర జలాల్లో పడింది. ఇది చాలా శక్తిమంతమైనదని, దాదాపు 6,200 కిలోమీటర్లు ఎత్తుకు వెళ్లిందని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 71 నిమిషాలు గగనతలంలో ఉంది. తమను అణ్వస్త్ర దేశంగా గుర్తించాలని, తమపై ఆంక్షలు తొలగించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఉత్తరకొరియా డిమాండ్ చేస్తోంది. అందులో భాగమే తాజా ప్రయోగమని తెలుస్తోంది.
ఇవీ చదవండి..
Steel: తాళాలు కొనాలన్నా తల్లడిల్లాల్సిందే.. ఎందుకో తెలుసా..?