Mayanmar Violance: మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మయన్మార్ శరణార్థులకు ఆశ్రయం ఇవ్వ వద్దంటూ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. మయన్మార్ దేశం నుంచి వచ్చే ప్రజల కోసం శిబిరాలు ఏర్పాటు చేయవద్దని, ఆహారం సమకూర్చవద్దంటూ ఉత్తర్వులను జారీ చేసింది. దేశంలోకి వచ్చే మయన్మార్ శరణార్థులను మర్యాద పూర్వకంగా వెనక్కి పంపాలని సరిహద్దు జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. భారత్ పొరుగు దేశమైన మయన్మార్‌లో ఫిబ్రవరి 1న సైనిక తిరుగుబాటు జరిగింది. ఆ దేశ పాలనను సైన్యం ఆధీనంలోకి తీసుకుంది. అప్పటినుంచి వారికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిని సైన్యం అణచివేస్తోంది. నిరసకారులపై బులెట్ల వర్షం కురిపిస్తున్నది. ఇప్పటి వరకూ సైన్యం కాల్పుల్లో సుమారు ఐదు వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పాయారని పలు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. అధికారికంగా దాదాపు 200ల మంది మరణించారు.
ఈ నేపథ్యంలో మయన్మార్ సరిహద్దు ప్రాంతాల నుంచి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర దేశాలకు వలస పోతున్నారు. ఆ దేశానికి పొరుగున ఉన్న థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, భారత్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. మయన్మార్‌తో భారత్‌కు 1,643 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. మణిపూర్, మిజోరమ్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాలు మయన్మార్‌తో సరిహద్దును కలిగి ఉన్నాయి. దీంతో మయన్మార్ శరణార్థులపై మణిపూర్ ప్రభుత్వం ఆంక్షలు విధించగా.. మరోవైపు మిజోరామ్ మాత్రం వారిపట్ల ఉదారత చూపుతోంది. శరణార్థులను అనుమతించడంతోపాటు శిబిరాలు ఏర్పాటు చేసి వారికి ఆహారం అందిస్తోంది.
మయన్మార్‌లో సంక్షోభ పరిస్థితుల నాటినుంచి ఆదేశంతో సరిహద్దు కలిగిన నాలుగు ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. గాయపడిన వారిని తప్ప.. శరణార్థులను దేశంలోకి అనుమతించవద్దని సూచించింది. వారిని శరణార్థులుగా అంగీకరించే అధికారం రాష్ట్రాలకు లేదని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి 1951 రెఫ్యూజీ కన్వెన్షన్ లేదా 1967 ప్రోటోకాల్‌లో భారత్ సంతకం చేయలేదంటూ పలు సూచనలు చేసింది.
Also Read: