న్యూజిలాండ్ కాల్పులు: తొమ్మిదిమంది భారతీయుల ఆచూకీ గల్లంతు

| Edited By:

Mar 16, 2019 | 1:47 PM

న్యూజిలాండ్‌లోని మసీదులలో శుక్రవారం జరిగిన మారణహోమంలో 49మంది మృతి చెందగా, మరో 48మంది తీవ్ర గాయాలతో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ దాడిలో మరణించిన వారిలో చాలామంది దక్షిణ ఆసియా దేశాలకు చెందిన వారే ఉన్నారని ఆయా ప్రభుత్వాలు అధికారికంగా వెల్లడించాయి. ఈ క్రమంలో దాడి తరువాత భారత్‌కు చెందిన తొమ్మిదిమంది ఆచూకీ గల్లంతు అయ్యిందంటూ న్యూజిలాండ్‌లో భారత రాయబారి సంజీవ్ కోహ్లీ తెలిపారు. దాడి జరిగిన సమయంలో […]

న్యూజిలాండ్ కాల్పులు: తొమ్మిదిమంది భారతీయుల ఆచూకీ గల్లంతు
Follow us on

న్యూజిలాండ్‌లోని మసీదులలో శుక్రవారం జరిగిన మారణహోమంలో 49మంది మృతి చెందగా, మరో 48మంది తీవ్ర గాయాలతో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ దాడిలో మరణించిన వారిలో చాలామంది దక్షిణ ఆసియా దేశాలకు చెందిన వారే ఉన్నారని ఆయా ప్రభుత్వాలు అధికారికంగా వెల్లడించాయి. ఈ క్రమంలో దాడి తరువాత భారత్‌కు చెందిన తొమ్మిదిమంది ఆచూకీ గల్లంతు అయ్యిందంటూ న్యూజిలాండ్‌లో భారత రాయబారి సంజీవ్ కోహ్లీ తెలిపారు. దాడి జరిగిన సమయంలో వీరు క్రిస్ట్‌చర్చ్ ప్రాంతంలో ఉన్నారన్న విషయంపై స్పష్టత రాలేదని, దీనిపై దర్యాప్తును చేస్తున్నామని ఆయన అన్నారు.

బంగ్లాదేశ్ రాయబారి షఫికుర్ రెహమాన్ బయ్యాన్ మాట్లాడుతూ.. చనిపోయిన వారిలో తమ దేశానికి చెందిన వారు ముగ్గురు ఉన్నారని, నాలుగు, ఐదు మంది తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన అన్నారు. పాకిస్థాన్‌కు చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారని, మరో ఐదుమంది ఆచూకీ తెలీడం లేదంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఫైజల్ తెలిపారు. అలాగే సౌదీకి చెందిన ఇద్దరు, మలేషియాకు చెందిన ఇద్దరు, టర్కీకి చెందిన ముగ్గురు గాయపడ్డ వారిలో ఉన్నారని ఆయా దేశాల విదేశాంగ మంత్రులు తెలిపారు. ఇక తమ దేశానికి చెందిన ఇద్దరి ఆచూకీ గల్లంతు అయ్యిందంటూ ఆఫ్ఘనిస్థాన్ రాయబారి ప్రకటించారు. అలాగే ఇండోనేషియాకు చెందిన ఓ తండ్రి, కుమారుడు కూడా ఈ దాడిలో గాయపడ్డారని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి వెల్లడించారు.

మరోవైపు క్రిస్ట్‌చర్చ్ హాస్పిటల్ చీఫ్ గ్రెగ్ రాబర్ట్‌సన్ మాట్లాడుతూ.. గాయపడ్డ 48మందిలో ఏడు మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. విషమంగా ఉన్న నాలుగేళ్ల బాలికను తాము ఆక్‌ల్యాండ్‌ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. గాయపడ్డవారిలో చాలామంది పలు శస్త్రచికిత్సలు అవసరమని ఆయన అన్నారు. కాగా క్రిస్ట్‌చర్చ్‌లో మసీదును నిర్మించిన మహ్మద్ ఎలాన్ అనే ఓ జార్డన్ దేశీయుడు కూడా ఈ దాడిలో గాయపడ్డాడు. ఆయనతో పాటు కుమారుడు కూడా కాల్పులకు బలయ్యాడని మహ్మద్ సోదరుడు మౌత్ ఎల్యాన్ పేర్కొన్నారు.