హిమాలయాల్లో ఏం జరిగింది..? నేపాల్‌లో వరదలకు కారణమేంటి..

హిమాలయాల్లో వేగంగా కరుగుతున్న గ్లేషియర్లు, పెరుగుతున్న హిమ సరస్సులు, కొండచరియలు, ఆకస్మిక వరదల ముప్పు ఆందోళన కలిగిస్తోంది. నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో తాజా వరదల నేపథ్యంలో గ్లేషియల్‌ లేక్‌ ఔట్‌బర్స్ట్‌ ఫ్లడ్‌ (GLOF) అంటే ఏమిటి? హిమాలయాల్లో వరదలు వస్తే భారత్‌లో ఏ రాష్ట్రాలకు ముప్పు ఉంటుంది? వరదల ప్రభావం ఎలా దిగువ ప్రాంతాలకు విస్తరిస్తుంది? ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, పర్యవేక్షణతో నష్టాన్ని ఎలా తగ్గించవచ్చో ఈ కథనంలో తెలుసుకోండి.

హిమాలయాల్లో ఏం జరిగింది..? నేపాల్‌లో వరదలకు కారణమేంటి..
Nepal Flash Floods 2026

Edited By:

Updated on: Aug 27, 2026 | 7:27 PM

హిమాలయాలు అంటే మంచు కొండలు. గ్లేషియర్లు. ప్రపంచంలోని కోట్లాది మందికి జీవనాధారం అందించే నదుల పుట్టినిల్లు. కానీ ఇప్పుడు ఇదే హిమాలయ ప్రాంతం వాతావరణ మార్పులతో ప్రమాదాలకు కేంద్రంగా మారుతోంది. మంచు వేగంగా కరుగుతోంది. గ్లేషియర్లు వెనక్కి తగ్గుతున్నాయి. కొత్తగా ఏర్పడుతున్న హిమ సరస్సులు ఉబ్బిపోతున్నాయి. కొండచరియలు, మంచు చరియలు విరిగిపడి..ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా నేపాల్‌-టిబెట్‌ సరిహద్దుల్లో సంభవించిన ఘోర వరదలు ఈ ప్రమాద తీవ్రతను మరోసారి ప్రపంచం ముందు ఉంచాయి.

నేపాల్‌లో తాజా విలయం

ఆగస్టు 26, 2026న నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు ప్రాంతంలో భారీ వరదలు, మట్టి ప్రవాహాలు విధ్వంసం సృష్టించాయి. గ్లేషియర్‌లోని మంచు, రాళ్లు ఒక్కసారిగా కూలిపోయి భారీ నీటి ప్రవాహం ఏర్పడిందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. భోటే కోసి నది లోయలోకి దూసుకొచ్చిన వరదలు గ్రామాలు, రహదారులు, వంతెనలు, విద్యుత్‌ ప్రాజెక్టులను ధ్వంసం చేశాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో విదేశీయులు, పర్యాటకులు, యాత్రికులు కూడా ఉన్నారు.

ఈ ఘటనకు భూకంపమే కారణమన్న తొలినాటి అనుమానాలను తర్వాతి పరిశీలనలు బలపరచలేదు. గ్లేషియర్‌ కూలిపోవడం, మంచు-రాళ్ల ప్రవాహం, నదిలో ఒక్కసారిగా భారీ నీటి ఉద్ధృతి కలిసి ఈ విపత్తుకు కారణమైందని నిపుణుల అంచనాలు సూచిస్తున్నాయి. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు సహాయక చర్యలకు కూడా పెద్ద అవరోధంగా మారాయి.

ఇది కొత్త పరిణామం కాదు

హిమాలయాల్లో ఇటువంటి విపత్తులు గతంలోనూ వచ్చాయి. 2021లో ఉత్తరాఖండ్‌లోని చమోలీ ప్రాంతంలో మంచు-రాళ్ల ప్రవాహం, వరదలతో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2023లో సిక్కింలోని సౌత్‌ లోనాక్‌ సరస్సు ఉప్పొంగి గ్లేషియల్‌ లేక్‌ ఔట్‌బర్స్ట్‌ ఫ్లడ్‌—GLOFలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. 2024లో నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలతో వందల మంది మరణించారు. అదే ఏడాది నేపాల్‌లోని థామే ప్రాంతంలో గ్లేషియల్‌ లేక్‌ ఔట్‌బర్స్ట్‌ ఫ్లడ్‌ వచ్చి ఇళ్లు, హోటళ్లు, పాఠశాల, ఆరోగ్య కేంద్రం సహా అనేక నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. 2025లోనూ నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో భారీ వరదలు ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి.

ఈ వరుస ఘటనలు ఒక విషయాన్ని చెబుతున్నాయి. హిమాలయాల్లో గ్లేషియర్లు, హిమ సరస్సుల పరిస్థితిని ముందుగానే గుర్తించి ప్రమాదాన్ని అంచనా వేయడం అత్యవసరం అని సూచిస్తున్నాయి.

ముప్పు ఎందుకు పెరుగుతోంది ?

ప్రధాన కారణాల్లో వాతావరణ మార్పు ఒకటి. ఉష్ణోగ్రతలు పెరగడంతో హిమాలయ గ్లేషియర్లు వేగంగా కరుగుతున్నాయి. గ్లేషియర్లు వెనక్కి తగ్గే కొద్దీ వాటి ముందు, పక్క ప్రాంతాల్లో నీటితో నిండిన కొత్త సరస్సులు ఏర్పడుతున్నాయి. ఈ సరస్సులను చాలాసార్లు మంచు, రాళ్లు, మట్టి వంటి సహజ పదార్థాల బలహీన అడ్డంకులు నిలిపి ఉంచుతాయి. ఆ అడ్డంకులు తెగిపోతే ఒక్కసారిగా భారీ నీటి ప్రవాహం దిగువ ప్రాంతాలకు దూసుకొస్తుంది. దీనినే గ్లేషియల్‌ లేక్‌ ఔట్‌బర్స్ట్‌ ఫ్లడ్‌.. GLOF అంటారు.

హిమాలయ-కారకోరం ప్రాంతంలో గతంలోనే వందలాది GLOF ఘటనలు నమోదయ్యాయి. గ్లేషియర్ల వెనుకడుగు, హిమ సరస్సుల విస్తరణతో ప్రమాదం మరింత పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రమాదకర హిమ సరస్సుల సమీపంలో, వాటి దిగువ నదీ లోయల్లో నివసించే లక్షలాది మంది ప్రజలు నేరుగా ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఉంది.

హిమాలయాలు ఎంత ఎత్తులో ఉన్నాయి?

హిమాలయాల ఎత్తు ప్రాంతాన్ని బట్టి భారీగా మారుతుంది. పర్వత పాద ప్రాంతాలు కొన్ని వందల మీటర్ల ఎత్తులో ఉండగా.. ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో 5,000 నుంచి 6,000 మీటర్లకు పైగా ఎత్తులు సాధారణం. ఎవరెస్ట్‌ వంటి శిఖరాలు 8,000 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్నాయి.

ఉదాహరణకు సిక్కింలోని సౌత్‌ లోనాక్‌ గ్లేషియల్‌ లేక్‌ సుమారు 5,200 మీటర్ల ఎత్తులో ఉంది. 2023లో ఈ సరస్సు ఉప్పొంగడంతో వచ్చిన GLOF వరద తీస్తా నది వెంట సిక్కిం నుంచి పశ్చిమ బెంగాల్‌ మీదుగా దిగువ ప్రాంతాల వరకు ప్రభావం చూపింది. ఇక్కడే అసలు ప్రమాదం దాగి ఉంది. వరద పుట్టే ప్రదేశం వేల మీటర్ల ఎత్తులో ఉండొచ్చు.. కానీ నష్టం ఎక్కువగా జరిగేది దిగువ నదీ లోయల్లోనే.

వరద వస్తే మొదట ప్రభావితమయ్యే ప్రాంతం ఏది?

సాధారణంగా GLOF లేదా గ్లేషియర్‌ కూలిన ఘటనలో వరద ప్రభావం కిందికి వస్తుంది. గ్లేషియర్‌ / హిమ సరస్సు → పర్వత లోయ → ఉపనది → ప్రధాన నది → నదీ తీర గ్రామాలు → దిగువ మైదాన ప్రాంతాలు ఇలా వరుస ఉంటోంది. అంటే మొదటి దెబ్బ గ్లేషియర్‌కు దిగువన ఉన్న ఇరుకైన పర్వత లోయలు, నదీ తీర గ్రామాలు, వంతెనలు, రహదారులు, జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు తగులుతుంది. నీటితో పాటు మంచు, బండరాళ్లు, మట్టి, చెట్ల దుంగలు కూడా కొట్టుకొస్తే విధ్వంసం మరింత పెరుగుతుంది. నీటి ప్రవాహం నది వెంట దిగువకు వెళ్లేకొద్దీ ప్రభావిత ప్రాంతం విస్తరిస్తుంది. అందుకే పర్వతాల్లో ప్రారంభమైన విపత్తు కొన్ని గంటల్లోనే దిగువ ప్రాంతాలకు చేరే ప్రమాదం ఉంటుంది.

భారత్‌లో ఏ రాష్ట్రాలకు ముప్పు?

హిమాలయాల్లో వచ్చే వరదలకు భారతదేశంలో ప్రధానంగా సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, లడఖ్‌ ప్రాంతాలు నేరుగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే వరద నీరు నదుల వెంట దిగువకు ప్రవహించడంతో పశ్చిమ బెంగాల్‌, అసోం వంటి మైదాన రాష్ట్రాలపైనా ప్రభావం పడొచ్చు.

టిబెట్‌లో పుట్టే అనేక నదులు భారత్‌లోకి ప్రవేశిస్తాయి. యార్లుంగ్‌ సాంగ్పో భారత్‌లోకి వచ్చిన తర్వాత సియాంగ్‌గా.. ఆపై అసోంలో బ్రహ్మపుత్రగా ప్రవహిస్తుంది. మరోవైపు తీస్తా వంటి నదులు సిక్కిం, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల హిమాలయాల్లో వరద అంటే పర్వత ప్రాంతానికే పరిమితమైన సమస్య కాదు.. నదీ ప్రవాహం ఎక్కడివరకు వెళ్తుందో అక్కడివరకు ముప్పు విస్తరించే అవకాశం ఉంటుంది.

ఎంత మేరకు నష్టం?

నష్టం ఎంత ఉంటుందనేది వరద పరిమాణం, నది వెడల్పు, లోయ ఆకారం, దిగువన ఉన్న జనాభా, వంతెనలు, డ్యామ్‌లు, జలవిద్యుత్‌ ప్రాజెక్టులు, రహదారులు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

2023 సిక్కిం GLOF

సౌత్‌ లోనాక్‌ సరస్సు ఉప్పొంగడంతో తీస్తా నదిలో నీటి మట్టం ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఈ విపత్తులో ప్రాణ నష్టం సంభవించడంతో పాటు వంతెనలు, రహదారులు, భవనాలు, విద్యుత్‌ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 1,200 మెగావాట్ల తీస్తా-III జలవిద్యుత్‌ ప్రాజెక్టు కూడా తీవ్రంగా ప్రభావితమైంది. వేలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితమయ్యారు.

2021 చమోలీ, ఉత్తరాఖండ్‌

చమోలీలో సంభవించిన ఆకస్మిక వరదలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు లేదా గల్లంతయ్యారు. జలవిద్యుత్‌ ప్రాజెక్టులు, రహదారులు, వంతెనలు, నదీ లోయల్లోని మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ రెండు ఘటనలు చెబుతున్న సందేశం ఒక్కటే—ప్రాణ నష్టంతో పాటు విద్యుత్‌, రవాణా, వ్యవసాయం, పర్యాటకం, స్థానిక ఆర్థిక వ్యవస్థలపైనా భారీ ప్రభావం పడుతుంది.

భారత్‌కు ఎందుకు ప్రత్యేక ముప్పు?

భారత్‌లోని హిమాలయ రాష్ట్రాల్లో అనేక పట్టణాలు, గ్రామాలు, రహదారులు, జలవిద్యుత్‌ ప్రాజెక్టులు నదీ లోయలకు సమీపంలోనే ఉన్నాయి. పర్యాటకం పెరగడం, రహదారులు విస్తరించడం, కొండ ప్రాంతాల్లో నిర్మాణాలు పెరగడం వల్ల ప్రమాద సమయంలో ప్రభావితమయ్యే ఆస్తుల విలువ కూడా పెరుగుతోంది. ఒక గ్లేషియర్‌ లేదా హిమ సరస్సు నుంచి అకస్మాత్తుగా నీరు విడుదలైతే.. అది కేవలం నీరు కాదు. నీటితో పాటు రాళ్లు, మట్టి, మంచు, చెట్లు, నిర్మాణాల అవశేషాలు కూడా దిగువకు కొట్టుకొచ్చే అవకాశం ఉంది. దీంతో సాధారణ వరద కంటే GLOF మరింత విధ్వంసకరంగా మారుతుంది.

ముందస్తు జాగ్రత్తలే రక్షణ

ఇలాంటి విపత్తులను పూర్తిగా ఆపడం సాధ్యం కాకపోయినా.. నష్టాన్ని గణనీయంగా తగ్గించడం మాత్రం సాధ్యమే. ప్రమాదకర హిమ సరస్సులను ఉపగ్రహాలు, డ్రోన్లు, రిమోట్‌ సెన్సింగ్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలి. సరస్సుల్లో నీటి మట్టం, మంచు గోడల స్థిరత్వాన్ని కొలిచే సెన్సర్లను ఏర్పాటు చేయాలి. అత్యంత ప్రమాదకర సరస్సుల్లో అవసరమైన చోట నియంత్రితంగా నీటిని తగ్గించే చర్యలు చేపట్టాలి. అంతకంటే ముఖ్యంగా ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌లను బలోపేతం చేయాలి. ఎగువ ప్రాంతాల్లో ప్రమాద సంకేతాలు గుర్తించిన వెంటనే దిగువ గ్రామాలకు సైరన్లు, మొబైల్‌ అలర్టులు, రేడియో, ఇతర కమ్యూనికేషన్‌ మార్గాల ద్వారా సమాచారం చేరాలి.

స్థానిక ప్రజలకు ముందుగానే శిక్షణ ఇవ్వాలి. ఎక్కడికి వెళ్లాలి.. ఏ మార్గంలో వెళ్లాలి.. ఏ ప్రాంతాలను తప్పించుకోవాలి అనే విషయాలపై స్పష్టమైన ఎమర్జెన్సీ ప్లాన్‌ ఉండాలి. రహదారులు, వంతెనలు, డ్యామ్‌లు, జలవిద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణంలో హిమ సరస్సులు, వరద మార్గాలు, కొండచరియల ప్రమాదాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.

సరిహద్దులు దాటే విపత్తుకు.. సరిహద్దులు లేని పరిష్కారం

హిమాలయాలు భారత్‌, నేపాల్‌, భూటాన్‌, చైనా వంటి అనేక దేశాలకు సాధారణ సహజ వ్యవస్థ. ఒక దేశంలో గ్లేషియర్‌ కదలిక లేదా హిమ సరస్సు ఉప్పొంగడం మరో దేశంలోని నదీ ప్రవాహాన్ని ప్రభావితం చేయవచ్చు. అందుకే ఉపగ్రహ డేటా, వాతావరణ సమాచారం, హిమ సరస్సుల పరిస్థితి, నదీ నీటి మట్టాలు, వరద హెచ్చరికలను దేశాల మధ్య వేగంగా పంచుకునే వ్యవస్థ అవసరం. అదే సమయంలో వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను తగ్గించడం, హిమాలయాల సున్నిత పర్యావరణ వ్యవస్థను కాపాడటం కూడా దీర్ఘకాలిక పరిష్కారంలో భాగం కావాలి.

చివరగా..

హిమాలయాల్లో మంచు కరుగుతోంది. కొండలు అస్థిరమవుతున్నాయి. హిమ సరస్సులు పెరుగుతున్నాయి. ఆకస్మిక వరదల ముప్పు విస్తరిస్తోంది. నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో తాజా విషాదం ఒక ప్రాంతానికి మాత్రమే సంబంధించిన ఘటన కాదు. హిమాలయాలు వేడెక్కితే.. ఆ ప్రభావం పర్వతాల నుంచి మైదానాల వరకు.. నదుల నుంచి కోట్లాది ప్రజల జీవనంపై పడే అవకాశం ఉంది.
హిమాలయాల్లో వరద పుట్టేది ఎత్తైన పర్వత ప్రాంతాల్లో.. మొదటి దెబ్బ తగిలేది గ్లేషియర్‌ దిగువన ఉన్న నదీ లోయలకు.. ఆ తర్వాత నదీ తీర గ్రామాలు, రహదారులు, వంతెనలు, జలవిద్యుత్‌ ప్రాజెక్టులు ప్రభావితమవుతాయి.. చివరికి నది ప్రవాహం దిగువ మైదాన ప్రాంతాలకు చేరుతుంది.

అందుకే వరద పుట్టేది పర్వతాలపై.. మొదటి దెబ్బ నదీ లోయలకు.. తర్వాత నదీ తీర గ్రామాలకు.. చివరికి దిగువ మైదాన ప్రాంతాలకు అనే ప్రమాద గొలుసును ముందుగానే అర్థం చేసుకోవాలి.

విపత్తు వచ్చిన తర్వాత స్పందించడం కంటే.. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి, ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలి. ప్రమాద ప్రాంతాల్లో నిర్మాణాలను నియంత్రించి, దేశాల మధ్య సమాచారాన్ని పంచుకోవాలి. ఇవే హిమాలయ భవిష్యత్తును, అక్కడి ప్రజల ప్రాణాలను కాపాడే కీలక మార్గాలు.

– కొండవీటి శివనాగరాజు, డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్, టీవీ9.

Loading...
Unable to load recommendations.
Follow Us