తెల్ల దేశం.. బ్రిటన్ లో జరిగిందో వింత ! లండన్ లోని మెట్రోపాలిటన్ పోలీసుల ట్విటర్ ఖాతా హ్యాక్ అయి.. ‘ విచిత్రంగా ‘ కనిపించడం ప్రారంభించింది. దీనికి సుమారు 12 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. సాధారణంగా ఈ ఖాతా.. నేరస్తుల అరెస్టులు, లేదా సంబంధిత సమాచార అపీళ్ల అప్ డేట్లను క్యారీ చేస్తుంది. టెర్రరిస్టు దాడులు జరిగినప్పుడు పోలీసులు లేటెస్ట్ డెవలప్ మెంట్ కోసం దీన్ని వినియోగిస్తుంటారు. అలాంటి కీలకమైన ఈ ట్విటర్ అకౌంట్ హఠాత్తుగా శుక్రవారం రాత్రి నుంచి హ్యాక్ కు గురై.. అర్థం, పర్థం లేని మెసేజులను పోస్ట్ చేయడం ప్రారంభించింది. ఉదాహరణకు..చురకత్తులు, బేస్ బాల్ బ్యాట్లు తీసుకువెళ్తున్న ఓ గ్రూపుతో పట్టుబడిన ఓ ఆర్టిస్టు ‘ డిగ్గా డే ‘ ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపితే.. అతడ్ని విడుదల చేయాలంటూ ఈ ఖాతాలో మెసేజ్ కనబడింది. ఇది చూసి ఆధికారులు ఆశ్చర్యపోయారు. ఇలాంటివే ఇంకా ఎన్నో సందేశాలు వెల్లువెత్తాయి. తలాతోకా లేని ఈ వైనం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టికి వచ్చింది. అంతే ! ఈ అకౌంట్ లోని ట్వీట్లలో ఒకదాని స్క్రీన్ షాట్ ని రీట్వీట్ చేస్తూ ఆయన… లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ని దుయ్యబట్టారు. (సాదిక్ కి, ట్రంప్ కి మధ్య కొంతకాలంగా విభేదాలున్నాయి). సాదిక్ ని ట్రంప్ అసమర్థునిగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. ‘ నీకు సురక్షితమైన మార్గాలే లేవు ‘ అని సెటైర్ వేశారు.
కాగా-తమ ట్విటర్ ఖాతాలోని ట్వీట్స్ ను పట్టించుకోవద్దని లండన్ పోలీసు సూపరింటెండెంట్ రాయ్ స్మిత్ ప్రజలను కోరారు. జరిగిన లోపాన్ని సరిదిద్దుతున్నామన్నారు. పోలీసుల సొంత ఇన్ ఫ్రా స్ట్రక్చర్ హ్యాక్ కాలేదని, దాని బదులు తాము వార్తల విడుదలకు వాడే థర్డ్ పార్టీ సైట్ హ్యాక్ అయిందని స్కాట్లాండ్ యార్డ్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ఏమైనా-ఈ ట్విటర్ ఫాలోవర్లకు పోలీసులు క్షమాపణ
చెప్పడం కొసమెరుపు.
With the incompetent Mayor of London, you will never have safe streets! https://t.co/pJqL1NjyvA
— Donald J. Trump (@realDonaldTrump) July 20, 2019