అమెరికా చరిత్రలో ఇదో మాయని మచ్చ.. ధీటుగా బదులిస్తాం.. యూఎన్ వేదికగా ఇరాన్ వార్నింగ్

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. అమెరికా ఎంట్రీతో నెక్ట్స్ ఏం జరగబోతోందని ప్రపంచమంతా ఊపిరిబిగబట్టి చూస్తోంది. ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహన్‌ అణు కేంద్రాలపై నేరుగా దాడిచేసింది అమెరికా. అమెరికాపై ప్రతీకారానికి సిద్ధమైన ఇరాన్‌.. ఇజ్రాయెల్‌పై భీకరంగా విరుచుకుపడింది.

అమెరికా చరిత్రలో ఇదో మాయని మచ్చ.. ధీటుగా బదులిస్తాం.. యూఎన్ వేదికగా ఇరాన్ వార్నింగ్
Iran Israel War

Updated on: Jun 23, 2025 | 11:41 AM

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. అమెరికా ఎంట్రీతో నెక్ట్స్ ఏం జరగబోతోందని ప్రపంచమంతా ఊపిరిబిగబట్టి చూస్తోంది. ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహన్‌ అణు కేంద్రాలపై నేరుగా దాడిచేసింది అమెరికా. అమెరికాపై ప్రతీకారానికి సిద్ధమైన ఇరాన్‌.. ఇజ్రాయెల్‌పై భీకరంగా విరుచుకుపడింది. బాహుబలిగా పేరున్న కోరమ్ షహర్-4 మిసైల్‌ని ఇజ్రాయెల్ పై ప్రయోగించింది. ఇరాన్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఎయిర్ పోర్టు, లాజిస్టిక్స్ హబ్స్, కమాండ్ కంట్రోల్ భవనాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్‌ దాడుల్లో టెల్‌అవీవ్, హైఫా, రిషన్‌లో దాదాపు 25 మంది మృతిచెందారు. అటు ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటివరకు ఇరాన్ లో కూడా దాదాపు 900 మంది మరణించినట్లు పేర్కొంటున్నారు. అటు ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్‌.. ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ లక్ష్యానికి చేరువైందంని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. టెహ్రాన్‌తో సుదీర్ఘ యుద్ధం చేయాల్సిన అవసరం ఉండదంటున్నారు. ఇరాన్‌ పాలకులు తమను తుడిచిపెట్టాలని చూసినందుకే ఈ ఆపరేషన్‌ చేపట్టాల్సి వచ్చిందన్నారు నెతన్యాహు. ఇరాన్‌ అణ్వాయుధాలు, బాలిస్టిక్‌ క్షిపణులను దెబ్బకొట్టే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు.

ఇదిలాఉంటే.. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. అమెరికా ప్రత్యక్షదాడిపై యూఎన్‌వోలోని ఇరాన్‌ రాయబారి అమీర్‌ సయీద్‌ ఇరవానీ తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. అమెరికా విదేశాంగ విధానాన్ని హైజాక్‌ చేసి.. అగ్రరాజ్యాన్ని నెతన్యాహు ఈ యుద్ధంలోకి లాగారని ఆరోపించారు. అమెరికా చరిత్రలో ఇది మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు ఇరాన్‌ రాయబారి. దీనికి సరైన సమయంలో ధీటుగా బదులిస్తామని హెచ్చరించారు.

అమెరికా ఇస్లామిక్ రిపబ్లిక్ పై ఒక కల్పిత – అసంబద్ధమైన సాకుతో దాడులు చేసిందని.. ఇజ్రాయెల్ దౌత్య ప్రయత్నాలను దెబ్బతీసిందని ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ UN భద్రతా మండలి అత్యవసర సమావేశంలో అన్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌ ఇరాన్ పై దాడులతో అమెరికా దౌత్యాన్ని నాశనం చేయాలని నిర్ణయించింది.. ఇరాన్ సరైన సమయంలో ప్రతిస్పందిస్తుంది.. సమయం, స్వభావం, స్థాయిని ఇరాన్ సైన్యం నిర్ణయిస్తుందని ఇరావానీ అన్నారు. ఈ స్పష్టమైన అమెరికా దురాక్రమణ, దాని ఇజ్రాయెల్ నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఇరాన్ అంతర్జాతీయ చట్టం ప్రకారం పూర్తి, చట్టబద్ధమైన హక్కును కలిగి ఉన్నప్పటికీ.. ఇరాన్ ప్రతిస్పందన సరైన సమయంలో కనిపిస్తుందన్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌లోని మూడు అణు కేంద్రాలను దాడి చేసిన.. కొన్ని గంటల తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి