చాట్‌ జీపీటీని అడిగి మరీ.. తల్లి, తమ్ముడిని హత్య చేసిన భారత సంతతి టీనేజర్‌

Indian origin teen kills mother brother in US: అమెరికాలోని మసాచుసెట్స్‌లో నివసిస్తున్న భారత సంతతి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. 17 ఏళ్ల కొడుడు కాలయముడిగా మారి తల్లి, తమ్ముడిని హతమార్చాడు. ఈ ఘటన స్థానిక ఇండియన్‌ కమ్యూనిటీని షాకయ్యేలా చేసింది.

చాట్‌ జీపీటీని అడిగి మరీ.. తల్లి, తమ్ముడిని హత్య చేసిన భారత సంతతి టీనేజర్‌
Mesquite Tx Murder Lawyer Scaled

Updated on: Aug 13, 2026 | 1:39 PM

Indian origin teen kills mother brother in US:  అమెరికాలోని మసాచుసెట్స్‌లో తల్లి, తమ్ముడిని హత్య చేసిన కేసులో భారతీయ సంతతికి చెందిన 17 ఏళ్ల బాలుడిపై కేసు నమోదైంది. యాక్టన్ బాక్స్‌ బరో హైస్కూల్‌లో చదువుతున్న అర్జున్ అరవింద్‌ కత్తులతో దాడి చేసి చంపినట్లు అతని పై రెండు హత్య కేసులు నమోదయ్యాయి. ఘటనలో అతని 14 ఏళ్ల తమ్ముడు సిద్ధార్థ్ అరవింద్, 45 ఏళ్ల తల్లి సుధా వెంకటేశన్ మృతి చెందారు. ఇంట్లోనే అర్జున్ తన తల్లి, తమ్ముడిపై కత్తులతో దాడి చేసి అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బోస్టన్‌కు సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఆక్టన్‌లోని ఇంట్లో మంగళవారం ఈ ఘటన జరిగింది.

ఆగస్టు 11 సాయంత్రం 6:30 గంటలకు అర్జున్ తండ్రి పోలీసులకు ఫోన్ చేశారు. కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఎవరూ స్పందించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఆ ఇంటికి రావాల్సిన ట్యూటర్ కూడా కుటుంబ సభ్యులతో సంప్రదించలేకపోయారు. అర్జున్ తండ్రి అదే రోజు ఉదయం ఆఫీస్‌కి వెళ్లే ముందు భార్య సుధాతో చివరిసారిగా మాట్లాడారు. సిద్ధార్థ్‌ను మధ్యాహ్నం సమయంలో స్థానికులు చివరి సారిగా చూశారు. ఇంటికి చేరుకున్న పోలీసులు ఇద్దరు విగతజీవులుగా పడి ఉండటం గుర్తించారు. సిద్ధార్థ్ మృతదేహం మొదటి అంతస్తులో, సుధా మృతదేహం బేస్‌మెంట్‌లో కనిపించింది.

అయితే, అప్పటికే అర్జున్ ఇంట్లో లేడు. అతను తన తల్లి కారులో అక్కడి నుంచి పారిపోయాడు. అతని కోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండాపోవడంతో ఇతర పోలీసు విభాగాలను అప్రమత్తం చేసి, అతని కోసం నిఘా పెట్టాలని ప్రజలను కూడా కోరారు. బుధవారం తెల్లవారుజామున మసాచుసెట్స్‌లోని వే‌లాండ్‌ పార్కింగ్ స్థలంలో జరిగిన మరో గొడవ సందర్భంగా వెళ్లిన పోలీసులు, అక్కడ తల్లి కారు లోపల అర్జున్ ని గుర్తించారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండా అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అర్జున్ ప్రవర్తన ఇటీవల ఆందోళనకరంగా మారినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కుటుంబ సభ్యులను హత్య చేయడం గురించి ఇంటర్నెట్, ChatGPTలో సెర్చ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. మర్డర్‌కు సంబంధించిన ఊహాజనిత అంశాలు, ఫాంటసీలను శోధించినట్లు గుర్తించారు. అలాగే హత్యా నవలల పేర్లను వాటి వివరాలను సైతం చాట్‌జీపీటీలో వెతికినట్లు తెలిసింది. అయితే ఈ భారతీయ కుటుంబం భారత్‌లోని ఏ ప్రాంతానికి చెందినవారో కచ్చితంగా తెలియాల్సి ఉంది. తమిళుల కుటుంబం అయి ఉండొచ్చని తెలుస్తోంది. అర్జున్‌ను తొలుత జువెనైల్ కోర్టులో హాజరుపరచాలని భావించారు. అయితే, హత్య కేసును విచారించే అధికారం జువెనైల్ కోర్టుకు లేకపోవడంతో కాన్‌కార్డ్ డిస్ట్రిక్ట్ కోర్టులో హాజరుపరచనున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Loading...
Unable to load recommendations.
Follow Us