Kash Patel: భగవద్గీతపై ప్రమాణం చేసిన అమెరికా కొత్త FBI డైరెక్టర్‌!

భారత సంతతికి చెందిన కాష్ పటేల్ FBI డైరెక్టర్‌గా ప్రమాణం చేశారు. హిందూ పవిత్ర గ్రంథమైన భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేషం. అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండి ప్రమాణం చేయించారు. పటేల్ FBIలో సమగ్రత, న్యాయాన్ని పునరుద్ధరించాలని, అమెరికాను మళ్ళీ సురక్షితంగా చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఆయనపై ఉన్న ఆరోపణలను తోసిపుచ్చారు.

Kash Patel: భగవద్గీతపై ప్రమాణం చేసిన అమెరికా కొత్త FBI డైరెక్టర్‌!
Fbi Director Kash Patel

Updated on: Feb 22, 2025 | 12:12 PM

భారత సంతతికి చెందిన కాష్ పటేల్ శుక్రవారం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) తొమ్మిదవ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన ప్రమాణస్వీకరం సమయంలో హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేసం. యుఎస్ సెనేట్ కాష్‌ పటేల్‌ను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమించిన తర్వాత యుఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండి, పటేల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కుటుంభ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ భవనంలో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. క్రిస్టోఫర్ వ్రే స్థానంలో కాష్‌ పటేల్‌ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అయితే కాస్‌ పటేల్‌ భగవద్గీతపై ప్రమాణం చేయడంతో ఆయనపై భారతీయులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా, దేశంలోని ప్రధాన సమాఖ్య చట్ట అమలు చేసే సంస్థకు నాయకత్వం వహించే ఈ అవకాశాన్ని కాష్ పటేల్ తన జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. FBI జవాబుదారీతనంతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. పటేల్ ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత.. “FBIలో సమగ్రత, న్యాయాన్ని పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైంది. అమెరికాను మళ్ళీ సురక్షితంగా చేయండి!” అంటూ , వైట్ హౌస్ అధికారిక ఎక్స్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు.

పటేల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ విలేకరులతో మాట్లాడుతూ.. “ఆ పదవిలో పటేల్‌ అత్యుత్తమ వ్యక్తిగా ఉంటారని భావిస్తున్నాను” అని అన్నారు, అలాగే ఎఫ్‌బీఐ ఏజెంట్లు పటేల్‌ను ప్రేమిస్తారని వెల్లడించారు. పటేల్‌ తన ప్రమాణ స్వీకారం సందర్భంగా మాట్లాడుతూ.. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఎవరిపై ఎటువంటి ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశ్యం తనకు లేదని, కేవలం రాజ్యాంగాన్ని అనుసరించాలని తాను పని చేస్తానని చెప్పారు. తనపై కొంతమంది చేస్తున్న ఆరోపణలు సరికాదని, అవి తన పరువుకు భంగం కలిగించేందుకు దురుద్దేశంతో చేస్తున్నారంటూ పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.