బ్రిటన్‌లోనే అత్యంత ఖరీదైన విడాకుల కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది. విడాకులు తీసుకున్న ఒక మహిళకు ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 750 కోట్ల రూపాయల భరణం చెల్లించాలని యూకే కోర్టు తీర్పునిచ్చింది.అయితే ఆమె భరణం పొందేది భర్త దగ్గర నుంచి కాదు.. కుమారుడి దగ్గర నుంచి. మామూలుగా భర్తే కదా భరణం చెల్లించాల్సింది.. కానీ ఇక్కడ కొడుకు తల్లికి భరణం చెల్లించాల్సి ఉంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం.
రష్యాకు చెందిన ప్రముఖ బిలియనీర్ అఖ్మదోవ్, తాతియానా దంపతులు కొన్నేళ్ల క్రితం విడిపోయారు. అప్పుడు వీరిద్దరూ లండన్‌లో ఉండేవారు. 2016లో వీరు విడాకులు తీసుకున్న సమయంలో తాతియానాకు 453 మిలియన్ పౌండ్లు భరణంగా ఇవ్వాలని లండన్ కోర్టు ఆదేశించింది. కానీ 5 మిలియన్ పౌండ్లు మాత్రమే చెల్లించిన అఖ్మదోవ్ రష్యాకు వెళ్లిపోయాడు. మిగిలిన భరణం సొమ్ము ఆమె పొందకుండా వాళ్ల పెద్ద కుమారుడు తెమూర్ అడ్డుతగిలాడు. తన తండ్రికి సపోర్ట్‌గా నిలబడి.. తన తల్లికి ఆస్తి వెళ్లకుండా చేయాల్సిన ప్రయత్నాలు చేశాడు
దీంతో తనకు రావాల్సిన భరణం సొమ్ము కోసం తాతియానా మరోసారి లండన్ కోర్టు మెట్లెక్కింది. తన తండ్రికి తెమూర్ లెఫ్టినెంట్‌గా వ్యవహరిస్తూ తనకు రావాల్సిన సొమ్ము రాకుండా చేస్తున్నాడని కుమారుడిపై దావా వేసింది. అయితే తాను చాలా నష్టాల్లో ఉన్నానని, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదివేటప్పుడు ట్రేడింగ్‌లో డబ్బు పెట్టి నష్టపోయానని తెమూర్ కోర్టులో తెలిపాడు. విషయం తన తల్లికి కూడా తెలుసునంటూ బుకాయించాడు. కానీ తెమూర్ వ్యాఖ్యలతో లండన్ కోర్టు విభేదించింది. తాతియానాకు తక్షణమే రూ.750కోట్లు భరణంగా చెల్లించాలని తీర్పునిచ్చింది.
Also Read: ఏపీలో కరోనా కల్లోలం.. కొత్తగా 11,698 పాజిటివ్ కేసులు, భారీగా మరణాలు