Imran Khan arrest: ఇమ్రాన్ ఖాన్‌ టార్గెట్‌గా పాక్ ఆర్మీ రాజకీయాలు.. అరెస్టుల భయంతో కనిపించకుండా పోతున్న పార్టీ నేతలు..

|

May 19, 2023 | 1:24 PM

పాకిస్థాన్‌లో ఏం జరుగుతోంది? దక్షిణాసియా పొలిటికల్‌ బ్యాలెన్స్‌ను ఆ పరిణామాలు పడదొస్తాయా? పొరుగు దేశం పాక్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను భారత్‌ ఆసక్తిగా గమనిస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పాపులారిటీలో ముందున్న ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో సైన్యం దూకుడుగా వ్యవహరించకపోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Imran Khan arrest: ఇమ్రాన్ ఖాన్‌ టార్గెట్‌గా పాక్ ఆర్మీ రాజకీయాలు.. అరెస్టుల భయంతో కనిపించకుండా పోతున్న పార్టీ నేతలు..
Imran Khan
Follow us on

పాకిస్తాన్‌లో పొలిటికల్‌ డ్రామా కొనసాగుతూనే ఉంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ టార్గెట్‌గా సాగుతున్న రాజకీయం రోజుకో రంగు మారుతోంది. మొన్నటి వరకు ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్‌ -ఈ- ఇన్సాఫ్‌ పార్టీ మద్దతుదారులు ఇమ్రాన్‌కు మద్దతుగా రోడ్లెక్కి నిరసనలు తెలిపారు. పాక్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అల్లకల్లోలం సృష్టించారు. ఇప్పుడు వారు అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు తలోదిక్కుకు పారిపోతున్న పరిస్థితి. ఇమ్రాన్‌ ఖాన్‌ నివాసం చుట్టుపక్కల 40 మంది టెర్రరిస్టులు దాక్కున్నారని చెప్తూ పాక్‌ పోలీసులు ఆయన ఇల్లు చుట్టుముట్టడంతో పాక్‌ పొలిటికల్‌ డ్రామాలో కొత్త అధ్యాయానికి తెరలేచింది.

ఆ హడావుడి చూసిన ఇమ్రాన్‌ ఖాన్‌ తనను అరెస్టు చేయడమో, చంపడమో జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బహుశా ఇదే తన చివరి ట్వీట్‌ కావచ్చని కూడా ప్రకటించారు. రాజకీయ నాయకులపై సైన్యం ఇలాంటి నిరనసలు, దాడులు జరగడం పాకిస్తాన్‌లో ఇది మొదటిసారేం కాదు. 2007లో బెనజీర్‌ భుట్టో హత్య సమయంలో పాకిస్తాన్‌లో ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. అయితే అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితి చాలా మారిపోయింది.

ఇమ్రాన్‌ ఖాన్‌ మరో జుల్ఫీకర్‌ అలీ భుట్టో అవుతారా? ఇమ్రాన్‌ను ఉరితీసే ధైర్యం పాక్‌ సైన్యానికి ఉందా? 1947 లో దేశంగా ఏర్పడిన నాటి నుంచి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాక్‌ను ఏలుతున్న సైన్యంపై ఇమ్రాన్‌ పైచేయి సాధించగలుగుతారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంత సులువేం కాదు.

ప్రజాదరణలో ప్రస్తుతం ఇమ్రాన్‌ ఖాన్‌ పాక్‌లోని మిగిలిన అందరు నాయకుల కంటే ఎంతో ముందంజలో ఉన్నారు. మార్చిలో నిర్వహించిన సర్వేలో ఇమ్రాన్ పాపులారిటీ 61 శాతం ఉంది. అదే వవాజ్‌ షరీఫ్‌, బిలావల్‌ భుట్టో రేటింగ్‌ 36 శాతమే. అంతే కాదు మొత్తం పాకిస్తాన్‌లోని 4 ప్రావిన్సుల్లోనూ అత్యంత పాజిటివ్‌ రాజకీయ నాయకుడిగా ఇమ్రాన్‌కు పేరుంది. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇమ్రాన్‌ రేటింగ్‌ గ్రాఫ్‌ పెరుగుతూ పోతోంది. ఈ సమయంలో పాక్‌ ఆర్మీ ఎలాంటి సాహసానికి పాల్పడినా అది ప్రభుత్వాని భారంగా పరిణమించడం తథ్యం.

అటు పాక్‌ సైన్యం విశ్వసనీయత దారుణంగా దెబ్బతింటోంది. పదేళ్ల క్రితమున్న విశ్వసనీయత ఇప్పుడు పాక్‌ సైన్యానికి లేదు. చైనా పాక్‌ ఎకనామిక్‌ కారిడర్‌ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో సైన్యం అవినీతికి పాల్పడిందనే ఆరోపణలు చాలా ఉన్నాయి. అంతే కాదు రాజకీయ వ్యవహారాల్లో నేరుగా తలదూర్చడం, రిటైరైన ఆర్మీ అధికారులను ఉన్నత పదవుల్లో నియమించడం, ఏకపక్షంగా వ్యవహరిస్తుండటం వంటి వాటి కారణంగా సామాన్య పాక్‌ పౌరుడి దృష్టిలో సైన్యం గౌరవమర్యాదలు బాగా సన్నగిల్లాయి.

ఇవన్నీ గమనించిన పాక్‌ సైన్యం ఇప్పుడు ఇస్లామిక్‌ కార్డులు, జాతీయవాదం అనే కార్డులు విసురుతోంది. పాక్‌ సైన్యంపై దాడి అంటే ఇస్లామిక్‌ విధానాలపైనే కాదు మొత్తం దేశంపైనే దాడి అన్నట్టుగా పాక్‌ సైన్యం మాట్లాడుతోంది. రకరకాల ప్రకటనల ద్వారా జనం మద్దతు సమీకరించుకునేందుకు పాక్‌ సైన్యం పడరాని పాట్లు పడుతోందన్నది నిజం. ఏది ఏమైనా ప్రస్తుతమున్న పరస్థితుల్లో పరస్పర అవగాహనతోనే సైన్యం సమస్య పరిష్కారించుకోవాలి తప్ప బలవంతంగా వ్యవహరిస్తే అది సైన్యానికి ఎదురుదెబ్బ తగులుతుందనే మాటలు పాక్‌లో వినిపిస్తున్నాయి.

మరో వైపు పాక్‌లో పరిస్థితి ఇలాగే కొనసాగితే అక్కడ పౌరయుద్ధం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. ఈ మధ్య పాక్‌లో నిరసనకారులు కలష్నికోవ్‌ రైఫిల్స్‌ వంటి ఆధునిక ఆయుధాలతో తిరుగుతూ కనిపించారు. పాక్‌లో ఆయుధాలు పట్టుకొని జనాలు తిరగడం కొత్తేమి కాదు, కాని, అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఈ పరిస్థితుల్లో ఇమ్రాన్‌ ఖాన్‌పై సైన్యం గనక చర్యలు చేపడితే పాక్‌లో పౌరయుద్ధం తప్పదనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కైబర్‌ లోయ, బలూచిస్థాన్‌లో తిరుగుబాటు దళాలు నిత్యం పాక్‌ సైన్యంపై దాడి చేస్తూ రక్తపాతం సృష్టిస్తున్నాయి. ఇది సింధ్‌, పంజాబ్‌ ప్రావిన్సులకు విస్తరిస్తే సమస్య మరింత జటిలమవుతుంది.

అటు పాక్‌ ఆర్థిక దుస్థితికి ప్రస్తుతం అధికారంలో ఉన్న PDM ప్రభుత్వం, షరీఫ్‌ కుటుంబం కారణమనే భావన పాక్‌ ప్రజల్లో ఉంది. ఇప్పటికిప్పుడు పాకిస్థాన్‌లో ఎన్నికలు నిర్వహిస్తే బంపర్‌ మెజార్టీతో ఇమ్రాన్‌ ఖాన్‌ తిరిగి గెలవడం ఖాయమనే విషయం అటు పాక్‌ సైన్యానికి, షరీఫ్‌ సోదరులకు తెలుసు. అదే సమయంలో తమను వ్యతిరేకించే ఇమ్రాన్‌ తిరిగి అధికారంలోకి రావడం పాక్‌ సైన్యానికి ఏ మాత్రం ఇష్టం లేదన్నది వాస్తవం. అందుకే పాక్‌లో ఎన్నికలు నిర్వహణకు పాక్‌ సైన్యంతో పాటు ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ భయపడుతున్న పరిస్థితి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పాక్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి మరో ఏడాది, రెండేళ్లు కొనసాగవచ్చు.

ఇవన్నీ పైకి కనిపించే విషయాలు. ఆందోళన కలిగించే విషయం మరొకటి ఉంది. రాజకీయ సంక్షోభం ఎప్పుడు తలెత్తినా సంబంధం లేని వ్యక్తులు రంగంలోకి రావడం పాక్‌లో పరిపాటిగా మారింది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు పాక్‌ సైన్యం కొన్ని సంస్థలకు ఊతమిచ్చింది. ఆ సంస్థలు రంగంలోకి దిగి ఆరాచకం సృష్టించినప్పుడు ఆటోమ్యాటిక్‌గా ప్రజల దృష్టి సైన్యం నుంచి మళ్లుతుంది. ఇలాంటి సంస్థలే కాకుండా మత ఉగ్రవాద సంస్థలు అనేకం పాక్‌లో ఉన్నాయి. అవన్నీ ప్రస్తుతం గుంభనంగా ఉన్నాయి. అవి రంగంలోకి దిగితే అల్లకల్లోలం చోటుచేసుకుంటుంది. అది పాక్‌కే కాదు పొరుగున్న భారత్‌కు కూడా ఆందోళన కలిగించే విషయమే. పాక్‌ను ఆనుకొని ఉండే పంజాబ్‌, జమ్ము కశ్మీర్‌లో శాంతి భద్రతలకు అది విఘాతం కలిగించవచ్చు.

ఏది ఏమైనా పాక్‌లో పరిస్థితి చూస్తుంటే ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో పాక్‌ సైన్యం దూకుడుగా వ్యవహరించే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. వేసే ప్రతీ అడుగునూ లెక్కించుకోవాల్సిన పరిస్థితిలో ప్రస్తుతం పాక్ సైన్యం ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం