Nigerian prisoners escape: నైజీరియాలో ఓ జైలుపై సాయుధులు దాడి చేశారు. ఈ ఘటనలో 1800 మందికి పైగా ఖైదీలు పారిపోయారు. మెషీన్ గన్ను, రాకెట్ గ్రేనేడ్లతో స్థానిక మిలిటెంట్లు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓవెరి పట్టణంలో ఉన్న జైలుపై సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు సాయుధులు అటాక్ చేశారని స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కొంతమంది సాయుధులు ఓవేరీ పట్టణంలోని జైలులోకి చొరబడి అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు బాంబులతో పేల్చేశారని అధికారులు తెలిపారు.
అయితే, ఈ ఘటన తరువాత 35 మంది ఖైదీలు పారిపోవడానికి నిరాకరించి అక్కడే ఉండిపోయారు. మరో ఆరుగురు తిరిగి వెనక్కి వచ్చారు. నిషిద్ధ ‘ ఇండిజీనస్ పీపుల్ బయాఫ్రా’ (ఐపీఓబీ) సంస్థ ఈ దాడికి పాల్పడిందని పోలీసులు చెప్పారు. మరోవైపు, ఆ సంస్థ ఈ దాడితో తమకు సంబంధం లేదని ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి.
ఐమో రాష్ట్రంలోని ఈ జైలు నుంచి మొత్తంగా 1,844 మంది ఖైదీలు పారిపోయారని నైజీరియన్ కరెక్షనల్ సర్వీస్ ధ్రువీకరించింది. సోమవారం తెల్లవారుజామున సాయుధ గుంపులు బస్సులు, ట్రక్కులలో ఓవేరీ కస్టోడియల్ సెంటర్లోకి దూసుకొచ్చారని, వారి వద్ద బాంబులు, మెషీన్ గన్లతో పాటు రాకెట్‌తో ప్రయోగించే గ్రెనేడ్లు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. రెండు గంటల పాటు సాగిన కాల్పుల్లో.. పోలీసులు, మిలిటరీ బిల్డింగ్‌లపై సాయుధులు దాడి చేశారు. అయితే పారిపోయిన ఖైదీలను పట్టుకునేందుకు ప్రభుత్వ ప్రత్యేక దళాలు ఆపరేషన్ చేపట్టాయి.