Russia-Ukraine War: రష్యా – ఉక్రెయిన్ మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ప్రపంచంలోని చాలా దేశాలు ఖండిస్తున్నాయి. కాగా.. దీనిపై భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. శాంతియుత చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచిస్తోంది.ఈ క్రమంలో భారత సంతతికి చెందిన రష్యాలోని ప్రజాప్రతినిధి డా. అభయ్ కుమార్ సింగ్ (Dr. Abhay Kumar Singh).. ఉక్రెయిన్‌పై పుతిన్ సైనిక చర్యలను సమర్థించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేయడం సమంజసమేనంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పార్టీ సభ్యుడు, లెజిస్లేచర్ డాక్టర్ అభయ్ కుమార్ సింగ్ స్పష్టంచేశారు. పశ్చిమ రష్యా నగరమైన కుర్స్క్ నుంచి లెజిస్లేచర్‌గా ఎన్నికైన అభయ్ కుమార్ సింగ్.. చర్చల కోసం ఉక్రెయిన్‌కు తగినంత అవకాశం ఇచ్చారని.. అవన్నీ విఫలం కావడంతో పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.
బంగ్లాదేశ్‌లో చైనా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తే భారత్ ఎలా స్పందిస్తుందో.. అలానే స్పందిస్తుందని అభయ్ కుమార్ స్పష్టంచేశారు. రష్యాకు వ్యతిరేకంగా నాటో ఏర్పడి.. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయినా విచ్ఛిన్నం కాకుండా క్రమంగా మనకు చేరువైందన్నారు. ఉక్రెయిన్ NATOలో చేరితే, ఉక్రెయిన్ తమ పొరుగు దేశం కాబట్టి అది NATO దళాలతో జతకట్టి ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందన్నారు. ఈ విషయంలో తమ అధ్యక్షుడికి సైనిక చర్య తీసుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. అందుకే ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు డాక్టర్ అభయ్ కుమార్ సింగ్ ఇండియా టుడేతో పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌పై అణుదాడి చేసేందుకు రష్యా యోచిస్తోందన్న ఊహాగానాలను రష్యా శాసనసభ్యుడు అభయ్ కుమార్ తోసిపుచ్చారు. అయితే రష్యాపై మరో దేశం దాడి చేస్తే.. దానికి ప్రతిస్పందించేందుకు అనుగుణంగా అణ్వాయుధ డ్రిల్‌ను నిర్వహించినట్లు పేర్కొన్నారు. అణ్వాయుధాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదతీ.. మరొక దేశం రష్యాపై దాడి చేస్తే ప్రతిస్పందించడానికి మాత్రమే అణ్వాయుధ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారని పేర్కొన్నారు. మరొక దేశం రష్యాపై దాడి చేస్తే, రష్యా అన్ని విధాలుగా స్పందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ అభయ్ కుమార్ సింగ్ ఎవరంటే..?
అభయ్ కుమార్ సింగ్ బీహార్‌లోని పాట్నాకు చెందిన వ్యక్తి. దాదాపు 30 ఏళ్ల క్రితం 1991లో మెడిసిన్ చదవడానికి రష్యా వెళ్లారు. ఆయన పాట్నాలోని లయోలా హైస్కూల్ లో విద్యను అభ్యసించారు. అనంతరం రష్యాలోని కుర్స్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.
ఆ తర్వాత, అతను రిజిస్టర్డ్ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయడానికి పాట్నాకు తిరిగి వచ్చారు. అనతికాలంలోనే మళ్లీ రష్యాకు తిరిగి వెళ్లి సొంతంగా ఫార్మాస్యూటికల్ వ్యాపారాన్ని ప్రారంభించారు. తర్వాత రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించారు. 2015లో వ్లాదిమిర్ పుతిన్ యునైటెడ్ రష్యా పార్టీలో చేరారు. ఆ తర్వాత 2018లో జరిగిన ప్రావిన్షియల్ ఎన్నికల్లో కుర్స్క్ నుంచి లెజిస్లేచర్‌గా గెలిచారు.
Also Read: