Covid Vaccine: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా.. కొత్త ఆశలు రేకెత్తించిన వ్యాక్సిన్‌.. ఇప్పటివరకు 143 దేశాల్లో 101.7 కోట్ల డోసుల టీకా పంపిణీ

|

Apr 25, 2021 | 4:19 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇప్పటికే ప్రపంచంలో 172 దేశాల్లో టీకా అందుబాటులోకి వచ్చింది.

Covid Vaccine: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా.. కొత్త ఆశలు రేకెత్తించిన వ్యాక్సిన్‌.. ఇప్పటివరకు 143 దేశాల్లో 101.7 కోట్ల డోసుల టీకా పంపిణీ
Global Covid Vaccinations Hit 100 Crore Mark
Follow us on

World Covid vaccinations: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ పంజాకు జనం అల్లాడిపోతున్నారు. చరిత్రలో ఎన్నడూ కనీవినని మారణహోమం.. ఇంట్లో ఒకరికి కరోనా నిర్ధారణ అయ్యిందంటే చాలు ఇంటిల్లిపాది కకావికలం చేసేస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. సరియైన ట్రీట్‌మెంట్ లేక, అవసరమైన బెడ్స్ లేక, ఉపిరి పీల్చుకునే ప్రాణ వాయువే కరువుతోంది.

ఇదే క్రమలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇప్పటికే ప్రపంచంలో 172 దేశాల్లో టీకా అందుబాటులోకి వచ్చింది. ఆయా దేశాల్లో ఇప్పటి వరకు 100కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. దీంతో ప్రపంచ జనాభాలో దాదాపు 6.6శాతం మంది పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్నారు. టీకా పంపిణీలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ వీటిని అధిగమించేందుకు ఆయా దేశాలు కృషిచేస్తున్నాయి.

కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో ప్రపంచ దేశాలు కనీవిని ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వణికిస్తోన్న కరోన వైరస్‌ మహమ్మారిపై జరుగుతోన్న పోరులో యావత్‌ ప్రపంచం ముందడుగు వేస్తోంది. ఈ సమయంలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం ప్రపంచ దేశాల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. దీంతో వ్యాక్సిన్‌ పంపిణీపైనే యావత్‌ ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా అనతికాలంలోనే కొవిడ్‌-19ని ఎదుర్కొనే టీకాను తయారు చేయడంతో పాటు వాటి పంపిణీని అంతే వేగంతో చేపడుతోంది. గతేడాది డిసెంబర్‌ 2వ తేదీన ఫైజర్‌ టీకా వినియోగానికి యూకే ఆమోదం తెలిపిన తొలి దేశంగా నిలిచింది. బ్రిటన్‌లో డిసెంబర్‌ 8, 2020 రోజున వ్యాక్సిన్‌ పంపిణీని ప్రారంభించింది. తొలి టీకా తీసుకున్న మహిళ మార్గరెట్‌ కీనన్‌(90ఏళ్లు) అనే బ్రిటన్‌ మహిళ రికార్డు సృష్టించారు.

అలా మొదలైన వ్యాక్సిన్‌ పంపిణీ.. ఐదు నెలలు పూర్తికాకముందే ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల డోసులను పంపిణీ చేయగలిగారు. వ్యాక్సిన్‌ వినియోగానికి ఆమోదం తెలిపిన 143 రోజుల్లోనే అంటే ఏప్రిల్‌ 24నాటికి వందకోట్ల మార్కును దాటడం విశేషం. ఇప్పటి వరకు పంపిణీ అయిన 100కోట్ల డోసుల్లో కొందరు తొలి డోసు తీసుకోగా, మరికొందరు రెండు డోసులను తీసుకున్నారు.

ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా ప్రపంచంలోనే టీకా పంపిణీని అత్యధిక వేగంగా చేపడుతోంది. ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా 22కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అమెరికా జనాభాలో మొత్తం 35శాతం మందికి కరనా టీకా అందింది. ఇందులో దాదాపు 42శాతం మంది తొలిడోసు, 28శాతం రెండు డోసులు తీసుకున్నారు. ఇక, తర్వాతి స్థానంలో ఉన్న చైనాలో ఇప్పటికే 21కోట్ల డోసులను అందించినట్లు సమాచారం. టీకా పంపిణీలో మూడో స్థానంలో ఉన్న భారత్‌లో ఇప్పటి వరకు 14కోట్ల డోసులను పంపిణీ చేసింది. యూరోపియన్‌ యూనియన్‌ లో 12కోట్ల డోసులు, బ్రిటన్‌ దేశంలో 4.5కోట్ల డోసులు, బ్రెజిల్‌లో 4కోట్ల డోసులు అందించాయి.

ఇక, ప్రపంచవ్యాప్తంగా కరోనా మరోసారి విరుచుకుపడుతుండటంతో మిగిలిన దేశాలు సైతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మరంగా చేపడుతున్నాయి. ఇక దేశ జనాభాలో అత్యధిక మందికి టీకా అందించిన దేశంగా ఇజ్రాయెల్‌ నిలిచింది. ఇప్పటికే అక్కడి జనాభాలో 57శాతం మందికి టీకా పంపిణీ పూర్తిచేసింది.

World Crosses 100 Crore Mark In Corona Vaccine

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు చేసిన కృషితో స్వల్పకాలంలోనే కొవిడ్‌ టీకా అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా ఒక వ్యాక్సిన్‌ రావడానికి 5 నుంచి 10ఏళ్ల సమయం పడుతుంది. కానీ, శాస్త్రవేత్తలు కృషి ఫలితంగా కేవలం పది నెలల్లోనే కరోనాను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా, టీకాల పనితీరుపై తాజాగా వస్తోన్న వాస్తవ ఫలితాలు కూడా ఊరట కలిగిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన టీకాలు 70 నుంచి 95శాతం సమర్థత చూపించడం శాస్త్రవేత్తల విజయంగా అభివర్ణిస్తున్నారు.

Read Also…  రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. జలుబు, ఫ్లూను తగ్గించే టీ.. సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోండిలా..