
మృతి చెందిన బాలికను లూసియానాలోని రస్టన్ ప్రాంతానికి చెందిన లిల్లీన్ స్మార్ట్ గా గుర్తించారు. ఆమె తన ఎనిమిదో పుట్టినరోజు జరుపుకున్న మరుసటి రోజే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
ఈ కష్టకాలంలో చిన్నారి కుటుంబానికి అండగా నిలిచేందుకు రస్టన్ ప్రాంతంలోని దాదాపు 24కు పైగా స్థానిక వ్యాపార సంస్థలు ముందుకు వచ్చాయి. తమ వ్యాపారంలో కొంత వాటాను ఆ కుటుంబానికి విరాళంగా అందించి మానవత్వాన్ని చాటుకున్నాయి.
తమ గారాల పట్టి మరణంపై బాలిక కుటుంబ సభ్యులు ఫేస్‌బుక్ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “మా లిల్లీన్ మా చేతుల మీదుగా కన్నుమూసింది. ఆమె మెదడుకు సోకిన ఇన్ఫెకన్ తీవ్రత ఎక్కువ కావడం వల్ల చిన్నారి శరీరం ఆ బాధను తట్టుకోలేకపోయింది. పాపను కాపాడటానికి తమ వంతు ప్రయత్నం చేసిన వారందరికీ మా అభినందనలు” అంటూ కుటుంబ సభ్యులు భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
లిల్లీన్ స్మార్ట్‌కు ఈ ప్రాణాంతక మెదడును తినే అమీబా సోకినట్లు కుటుంబ సభ్యులు, స్నేహితులు గుర్తించారు. ఆగస్టు 15న చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది.
ఈ ‘నేగ్లేరియా ఫౌలేరి’ ఇన్ఫెక్షన్లు చాలా అరుదుగా సంభవిస్తుంటాయి. లూసియానాలో 2011 నుండి ఇప్పటివరకు కేవలం కొన్ని మాత్రమే ఇలాంటి కేసులు నమోదయ్యాయి. వేడి నీటి సరస్సులు, కుంటలలో ఈ అమీబా ఎక్కువగా జీవిస్తుంది. ముక్కు ద్వారా నీరు లోపలికి వెళ్లినప్పుడు అది మెదడులోకి ప్రవేశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వేడి వాతావరణం, నిల్వ ఉన్న నీళ్లు కొన్ని రకాల బాక్టీరియాకు ఆవాసంగా మారతాయి. అవి మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తే ప్రాణాంతకమైన వ్యాధులకు దారితీస్తాయి. అలాంటి వాటిలో ఒకటి ‘మెదడును తినే అమీబా’గా పిలిచే నేగ్లేరియా ఫోలెరీ. ఇది నీళ్లను శుభ్రం చేయక ఎక్కువ రోజులు వదిలేసే స్విమ్మింగ్ పూల్స్‌లో వేగంగా వ్యాపిస్తుంది. ఒక్కసారి దాడి చేసిందంటే బాధితులకు చావే గతి. సరస్సులు, వేడి నీటి బుగ్గలు, నదులు, సరిగా క్లోరినేట్ చేయని స్విమ్మింగ్ పూల్స్ లేదా పెరటి తోటల్లోని పైపుల్లో ఉండే నీళ్లలో ఇది పెరుగుతుంది