France on Indian travellers: భారత్‌లో కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకి కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో భారత్ నుంచి ఫ్రాన్స్ వెళ్లే ప్రయాణికులపై ఆంక్షలు విధించేందుకు సిద్ధం అవుతోంది. ప్రయాణికులు 10 రోజులపాటు క్వారెంటైన్‌లో ఉండే విధంగా ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు ఫ్రాన్స్ అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
బుధవారం రోజు ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. పలు దేశాల్లో కరోనా తీవ్రత చాలా సీరియస్‌గా ఉన్నట్టు గుర్తించామన్నారు. ఈ క్రమంలో నిబంధనలు కఠినతరం చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు వెల్లడించారు. ‘పలు దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. అక్కడ ఆరోగ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అందుకే.. ఆయా దేశాల నుంచి ఫ్రాన్స్‌కు వచ్చే ప్రయాణికులపై కఠిన ఆంక్షలకు సిద్ధం అవుతున్నాం’ అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆయా దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. అయినా ఇంకా నిర్ణయం తీసుకోలేదని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఇదిలావుంటే, తమ దేశంలో రోజువారి కొవిడ్ కేసుల సంఖ్య రానున్న రోజుల్లో భారిగా తగ్గే అవకాశం ఉందని ఫ్రాన్స్ భావిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం అమలవుతున్న దేశ వ్యాప్త కర్ఫ్యూ నిబంధనలను మే 2 తర్వాత సడలించేందుకు సిద్ధం అవుతోంది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ కూడా స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న దేశాల్లో .. ప్రపంచ పట్టికలో ఫ్రాన్స్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. కాగా, కరోనా విజృంభణ నేపథ్యంలో ఫ్రాన్స్ రెండోసారి లాక్‌డౌన్‌ని విధించింది. అత్యవసర అవసరాలు మినహా మిగిలిన షాపులను క్లోజ్ చేశారు. ప్రజలు ఇంట్లోనే ఉండాలని అక్కడి ప్రభుత్వం తెలిపింది. బయటకు వెళ్లాలంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాలని అధికారులు వివరించారు.
Read Also…ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరాను అడ్డుకున్న హర్యానా ప్రభుత్వ అధికారి, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా