Anil Boinapalli: అమెరికాలో తెలుగోడి ఘనత.. అరుదైన అవార్డుకు ఎంపిక

తెలంగాణకు చెందిన అనిల్ బోయినపల్లికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. వర్జీనియాలో స్థిరపడ్డ ఆయన 2025 లీడర్‌షిప్‌ గ్లోబీ అవార్డుకు ఎంపికయ్యారు. ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో తన సంస్థ స్కై సొల్యూషన్స్‌ ద్వారా సాధించిన విజయాలు ఈ గౌరవానికి కారణమయ్యాయి. ..

Anil Boinapalli: అమెరికాలో తెలుగోడి ఘనత.. అరుదైన అవార్డుకు ఎంపిక
Anil Boinapalli

Updated on: Oct 17, 2025 | 7:33 PM

తెలంగాణ వ్యక్తికి అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. వర్జీనియాలో స్థిరపడ్డ అనిల్ బోయినపల్లి ప్రతిష్ఠాత్మకమైన 2025 లీడర్‌షిప్ గ్లోబీ అవార్డుకి ఎంపికయ్యారు. వ్యాపార రంగంలో క్రమంగా ఎదిగి, సాంకేతిక ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఆయనకు ఈ గుర్తింపు లభించింది.

స్కై సొల్యూషన్స్‌ అనే సంస్థను అనిల్ 2008లో వర్జీనియాలో స్థాపించారు. ప్రస్తుతం సంస్థ కార్యకలాపాలు అమెరికా సహా అనేక దేశాలకు విస్తరించాయి. ఏఐ (AI), సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో ఈ సంస్థ అందిస్తున్న వినూత్న సేవలతో గుర్తింపు పొందింది. ఆ సంస్థ సీఈవోగా అనిల్ చూపిస్తున్న లీడర్షిప్, వ్యాపారంలో నాణ్యతా ప్రమాణాలను పాటించే తీరు ఈ అవార్డు దక్కేలా చేశాయి.

గ్లోబీ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. “గ్లోబీ అవార్డ్స్‌ పూర్తిగా ప్రతిభ ఆధారంగా అందజేస్తారు. విజేతల ఎంపికను స్వతంత్ర పరిశ్రమ నిపుణుల మూల్యాంకనంతో నిర్ణయిస్తారు.” అని తెలిపింది.

అనిల్ బోయినపల్లి వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. అనంతరం సీఎన్‌ఎస్‌ఐ (CNSI) సంస్థలో ఆర్కిటెక్ట్‌గా పనిచేసి, హెల్త్‌కేర్‌ రంగంలో సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు ఫెన్నీ మే (Fannie Mae), హారిస్ కార్పొరేషన్‌ వంటి ప్రముఖ సంస్థల్లోనూ వివిధ హోదాల్లో పని చేశారు. సాంకేతికతలో నైపుణ్యం, వ్యాపారంలో దూరదృష్టి కలగలిపిన అనిల్‌ బోయినపల్లి సాధించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు, తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.