Donald Trump: బిగ్ బిల్లుకు సెనెట్ ఆమోదం.. ట్రంప్ వార్నింగ్..వెనక్కి తగ్గిన మస్క్

ఎలన్ మస్క్ ఎంత వ్యతిరేకించిన డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్నది చేస్తూ ముందుకు సాగుతోన్నారు. ట్రంప్ తెచ్చిన బిగ్ బ్యూటిపుల్ బిల్లుకు సెనెట్ ఆమోదం తెలిపింది. 18 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత ఈ బిల్లుకు సమాన ఓట్లు రాగా.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ట్రై బ్రేక్ ఓటేసి బిల్లును గట్టెక్కించారు. ఈ బిల్లుపై అమెరికాలో స్థిరపడ్డ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Donald Trump: బిగ్ బిల్లుకు సెనెట్ ఆమోదం.. ట్రంప్ వార్నింగ్..వెనక్కి తగ్గిన మస్క్
Donald Trump

Updated on: Jul 02, 2025 | 10:31 AM

డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోన్నారు. గతంలో వివిధ దేశాలపై భారీగా పన్నుల విధించిన ట్రంప్.. ఆ తర్వాత కొద్దిగా వెనక్కి తగ్గారు. అంతేకాకుండా తన పాలనలో అనవసర ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను తీసుకొచ్చారు. పన్నులు, బడ్జెట్ కు సంబంధించిన ఈ బిల్లును గతంలో డోజ్ బాధ్యతలు చూసినటువంటి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు పాసైతే కొత్త పార్టీ పెడతానంటూ ప్రకటించారు. రిపబ్లిక్, డెమోక్రాట్ పార్టీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వారి కోసం కొత్త పార్టీ పెడతానని తెలిపారు.

ఈ క్రమంలో ప్రెసిడెంట్ ట్రంప్..మస్క్ పై నిప్పులు చెరిగారు. మస్క్ సంస్థలకు అందిస్తున్న పన్నుల రాయితీలను నిలిపివేస్తానంటూ హెచ్చరించారు. చివరకు మస్క్ సౌతాఫ్రికాకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఈ క్రమంలో ఎలన్ మస్క్ కొంత వెనక్కి తగ్గారు. ఈ బిల్లుపై ప్రస్తుతానికి అయితే ఏం చేయదలుచుకోలేదంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు సెనెట్ ఆమోదం తెలిపింది. సెనెట్ లో ఈ బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగా 50-50 ఓట్లు పడగా.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టై-బ్రేకింగ్ ఓటుతో బిల్లు నెగ్గింది. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు 51-50 మార్జిన్‌తో నెగ్గినట్టు వాన్స్ ప్రకటించారు.

మొత్తం 1000 పేజీలు ఉన్న ఈ బిల్లుపై సెనెట్ లో వాడీవేడీ చర్చ జరిగింది. సభ్యులు ప్రతిపాదించిన సవరణపై 18 గంటలపాటు మారథాన్ చర్చ నడిచింది. చివరకు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. ఇప్పుడు ఈ బిల్లు ప్రతినిధుల సభకు వెళ్తుంది. అక్కడ ఆమోదం లభించాక ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గరకు వస్తుంది. ఏదిఏమైనా ట్రంప్ తాను అనుకున్న నిర్ణయాలపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.