టొరాంటో, ఫిబ్రవరి 18: కారో, బస్సో పల్టీలు కొట్టడం చూశాంగానీ.. విమానం పల్టీ కొట్టడం ఎప్పుడైనా చూశారా? ఇప్పడు ఆ సరదా కూడా తీరిపోయింది. కెనడాలోని టొరంటో ఎయిర్‌పోర్టులో సోమవారం (ఫిబ్రవరి 17) ఓ విమానం అదుపుతప్పి అమాంతం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో స్కిడ్ అయి పల్టీలు కొట్టింది. అక్కడ తీవ్రంగా మంచు కురుస్తుండటంతో విమానం రన్‌వేపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 19 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ విమానం మిన్నెపోలిస్ నుంచి టొరంటోకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం నేపథ్యంలో ఎయిర్‌పోర్టును మూసివేశారు.
సోమవారం మంచు తుఫాను కారణంగా తీవ్ర గాలులు చుట్టుముట్టాయి. ఇలాంటి వాతావరణం మధ్య డెల్టా ఎయిర్ లైన్స్ ప్రాంతీయ జెట్ విమానం టొరంటో పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించింది. ఇంతలో బలమైన గాలులతోపాటు రన్‌వే ఉన్న మంచు కారణంగా విమానం ఒక్కసారిగా తలక్రిందులుగా పల్టీలు కొట్టింది. డెల్టా ఎండీవర్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన CRJ900 విమానం ఈ ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో విమానంలో 76 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. బోల్తా పడిన విమానం నుంచి పొగలు రావడంతో అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపు చేసి, అందులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. విమానంపై నీటిని చల్లుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
BREAKING: First video from the plane crash in Toronto. A Delta CRJ900 flying from Minneapolis just crashed at the airport.
The plane is upside down and has lost its wingspic.twitter.com/JwMWrc0DtH
— Global Trends (@Global_Trends10) February 17, 2025
కెనడాకు చెందిన బాంబార్డియర్ తయారు చేసిన ఈ CRJ900 విమానంలో మొత్తం 90 మంది వరకు ప్రయాణించవచ్చు.ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తామని కెనడియన్ అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 19 మంది ప్రయాణికులేనని, వారిని ఏరియా ఆసుపత్రులకు తరలించారని డెల్టా ఓ ప్రకటనలో తెలిపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.