
దక్షిణ ఇరాన్ నగరమైన బందర్ అబ్బాస్‌లోని షాహిద్ రాజయీ ఓడరేవులో శనివారం భారీ పేలుడు సంభంవించింది. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 40 మంది వరకు మరణించినట్టు ఇరాన్ అధికారిక వర్గాలు వెల్లడించారు. ఈ ప్రమాదంతో సుమారు వెయ్యి మందికిపైగా గాయపడినట్టు.. వీరిలో 197 మందిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలించినట్టు తెలిపారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో సోమవారం జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. ఇక ఆదివారం ఆయనే స్వయంగా ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. తర్వాత ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించినట్టు అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.
అణ్వాయుధాలపై ఇరాన్, అమెరికాలు ఒమన్‌లో మూడో విడత చర్చలు జరుపుతున్న సమయంలో బందర్ అబ్బాస్ నగరంలోని షాహీద్ రజాయే ఓడరేవులో ఈనెల 26న ఈ భారీ పేలుడు సంభవించింది. పేలుడు సంభవించిన వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నికీలలు కంటైనర్ యార్డ్ మొత్తం వ్యాపించాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు మంటలార్పేందుకు చర్యలు చేపట్టారు. సుమారు ఐదు ప్రావిన్స్‌ల నుంచి వచ్చిన అగ్నిమాపక బృందాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించినట్టు తెలుస్తోంది. పోర్టులోని కొన్ని కంటైనర్లలో ఉన్న రసాయన, మండే స్వభావాన్ని కలిగి ఉన్న పదార్థాల కారణంగానే ప్రమాదం జరిగినట్టు సమాచారం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి