Covid-19: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృత్యుఘంటికలు.. రోజుకు సగటున 12వేలకుపైగా మృతి… ఇప్పటి వరకు 30 లక్షలు దాటిన మరణాలు

| Edited By: Ram Naramaneni

Apr 18, 2021 | 8:17 AM

World Coronavirus: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా మృత్యుఘంటికలు మోగిస్తోంది. సెకండ్‌వేవ్‌లో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడి...

Covid-19: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృత్యుఘంటికలు.. రోజుకు సగటున 12వేలకుపైగా మృతి... ఇప్పటి వరకు 30 లక్షలు దాటిన మరణాలు
Coronavirus
Follow us on

World Coronavirus: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా మృత్యుఘంటికలు మోగిస్తోంది. సెకండ్‌వేవ్‌లో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. శనివారం నాటికి కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30 లక్షలు దాటేసింది. భారత్‌, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌లలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య కీవ్‌, ఉక్రెయిన్‌, కరాకస్‌, వెనెజులా దేశాల జనాభాతో సమానం. అమెరికాలోని షికాగో నగర జనాభా 27 లక్షలు కంటే అధికం. పలు ప్రభుత్వాలు మరణాలను దాచే అవకాశం ఉన్న నేపథ్యంలో వాస్తవ మరణాల సంఖ్య ఇంతకంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేసింది.

రోజుకు 7 లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా రోజుకు సగటున 7 లక్షలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. 12 వేల మందికిపైగా మృత్యువాత పడుతున్నారు. ఒక్క అమెరికాలోనే ఇప్పటి వరకు 5.6 లక్షల మంది కోవిడ్‌ బారిన పడి ప్రాణాలు వదిలారు. ప్రపంచం మొత్తం మరణాల్లో అరింట ఒక వంతు అమెరికాలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా తర్వాత స్థానాల్లో బ్రెజిల్‌, మెక్సికో, భారత్‌, బ్రిటన్‌లు ఉన్నాయి.

మళ్లీ కఠిన ఆంక్షలు దిశగా..

కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ తీవ్ర స్థాయికి చేరుతుండటంతో ప్రపంచ దేశాలు మళ్లీ కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశాయి. అయితే పలు దేశాల్లో వ్యాక్సిన్ల కొరత ఉండటంతో కొంత ఇబ్బందికరంగా మారింది. ఒక వైపు కోవిడ్‌ కేసులు పెరగడం, మరో వైపు వ్యాక్సిన్ల కొరత ఉండటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు, రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తుండటంతో పలు దేశాల్లో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, అస్ట్రాజెనెకా టీకాలపై తాత్కాలిక నిషేధం విధించారు. కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజుల కిందట కేసులు, మరణాలు దాదాపు తగ్గిపోగా, సంతోషం వ్యక్తం చేస్తున్న దేశాలకు మళ్లీ నెత్తిన పిడుగు పడినట్లు ఒక్కసారిగా కేసులు, మరణాలు పెరిగిపోయాయి.

అత్యధిక పాజిటివ్‌ కేసులు ఉన్న దేశాలు ఇవే…

► అమెరికా 3.15,67,744
► భారత్‌ 1,45,26,609
► బ్రెజిల్‌ 1,38,32,455
► ఫ్రాన్స్‌ 52,85,307
► రష్యా 46,40,537

అత్యధిక మరణాలున్న దేశాలు ఇవే..

► అమెరికా 5,66,240
► బ్రెజిల్‌ 3,68,749
► మెక్సికో 2,11,693
► భారత్‌ 1,75,649
► బ్రిటన్‌ 1,27,472