COVID-19 Confirmed Pet Dog: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ మహమ్మారితో నిత్యం లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ మనుషులతోపాటు.. జంతువులను కూడా వెంటాడుతోంది. ఇప్పటికే పలు జంతువులకు కరోనా వ్యాప్తిచెందిన విషయం తెలిసిందే. అయితే.. మనుషుల నుంచే జంతువులకు కరోనా వ్యాపిస్తుందని పలువురు నిపుణులు పేర్కొంటున్నప్పటికీ.. ఇది ఇప్పటివరకు నిరూపితం కాలేదు. తాజాగా బ్రిటన్‌లో ఓ పెంపుడు కుక్కకు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాని యాజమాని వల్లే ఆ శునకం కరోనా బారిన పడిఉండోచ్చని జంతు వైద్యులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. యూకేలోని వేబ్రిడ్జ్‌లో ఉన్న యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీ (APHA) ల్యాబొరేటరీలో కుక్కకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు యూకే చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ తెలిపారు. ఆ కుక్కకు నవంబర్ 3న పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అది చికిత్స పొందుతోందని, దాని పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
శునకం యజమానికి ఈ మధ్య కరోనా బారిన పడ్డారని.. ఆయన నుంచే కరోనా వ్యాపించి ఉండొచ్చని వైద్యులు వెల్లడించారు. అయితే ఆయన నుంచే కరోనా వ్యాపించిందనడానికి ఆధారాలు లభించినట్లు చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ క్రిస్టిన్ మైడెల్మిస్ చెప్పారు. అయితే ఆ కుక్క వల్ల ఇతర జీవులకు కరోనా వ్యాప్తిచెందినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని.. కుక్కలకు ఇన్‌ఫెక్షన్ కావడం చాలా అరుదని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో కుక్కలకు కొన్ని లక్షణాలు మాత్రమే కనిపిస్తాయని.. కొన్ని రోజుల్లోనే అవి కోలుకుంటాయని వెల్లడించారు.
అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఈ కేసు గురించి ప్రపంచ జంతువుల ఆరోగ్య సంస్థకు వివరాలు పంపినట్లు తెలిపారు. దీనిపై అధ్యయన కొనసాగుతోందని.. త్వరలోనే వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు.
Also Read: