Shocking Corona Counts: కరోనా మహమ్మారి పంజా ఎంతమంది మీద పడింది? ఎంతమంది దాని ధాటికి ప్రాణాలు కోల్పోయారు. ప్రతిరోజు అధికారిక ప్రకటనలతో ప్రపంచంలోని ప్రభుత్వాలు వెల్లడిస్తున్న లెక్కలను చూసి అవునా అనుకుంటున్నారా? అయితే, మీకు షాక్ తగిలే లెక్క నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల కరోనా లెక్కలూ కాకి లెక్కలేనని తేల్చేశారు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం వివిధ దేశాల్లో కరోనా లెక్కలన్నీ తప్పులతడకలేనని తెలుస్తోంది. విశ్వవిద్యాలయం వేదికగా పనిచేస్తున్న ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూయేషన్ (ఐహెచ్‌ఎంఈ)’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. మృతుల సంఖ్యను లెక్కించడంలో పలు దేశాలు పారదర్శకంగా వ్యవహరించడంలేదని ఆ నివేదిక చెబుతోంది. మే నెల మొదటి వారం వరకూ వివిధ దేశాలలో నమోదైన కరోనా కేసులు, మరణాలను అధ్యయనం చేసి ఈ నివేదిక తయారుచేశారు. అనేక దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా తప్పుడు గణాంకాలే ఇస్తున్నాయని ఇందులో వెల్లడైంది. ఈ నివేదిక వివరాలు మే 7 న విడుదలయ్యాయి.
ఈ అధ్యయనం ప్రకారం…
ఈ సంవత్సరం మే 6వ తారీఖు వరకూ ప్రపంచవ్యాప్తంగా 32.64 లక్షల కరోనా మరణాలు సంభవించాయని వివిధ ప్రభుత్వాల గణాంకాలు చెపుతున్నాయి. కానీ, వాస్తవ మరణాల సంఖ్య దీనికి రెట్టింపు కంటే ఎక్కువగా దాదాపు 69 లక్షల వరకూ ఉంటాయని అంచనా వేశారు నిపుణులు. ఒక్క భారతదేశంలోనే ప్రభుత్వ గణాంకాల కంటే వాస్తవ మరణాలు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశారు. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ నెల 3 వరకూ దేశంలో కరోనాతో మృతి చెందినవారు మొత్తం -2,22,386. అయితే, వాస్తవ మరణాలు 6,54,395 అని ఆ అధ్యయనం తేల్చింది.
59 దేశాల్లో గల 198 రాష్ట్రాల్లోని పరిస్థితులను అధ్యయనం చేసిన ఐహెచ్‌ఎంఈ షాకింగ్ వివరాలు బయటపెట్టింది. అన్ని రకాల సమాచారాన్ని విశ్లేషిస్తే.. ప్రస్తుతం లెక్కల్లో చెప్పినదాని కన్నా ఎక్కువగానే మరణాలున్నట్లు నిర్ధారించుకొని వాస్తవానికి దగ్గరగా రావడానికి ప్రయత్నించామని ఆ సంస్థ చెప్పింది. చాలామంది ప్రజలు ఆసుపత్రులకు దూరంగా ఉండటం, కొన్ని దేశాల్లో ఆందోళన(డిప్రెషన్)తో పాటు, అతిగా మందుల వినియోగం పెరిగిపోవడం.. హృద్రోగం, దీర్ఘకాల ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారి మరణాలు.. ఇలాంటి కారణాల వల్ల కొన్ని మరణాలు పెరిగి ఉండొచ్చునని నివేదికలో వెల్లడించారు.
ప్రధానంగా తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలో మరణాలను తక్కువగా చూపుతున్నట్లు పేర్కొన్న నివేదిక, ఈజిప్ట్‌లో ప్రభుత్వం చెప్పిన లెక్కల కంటే 10 రెట్లు ఎక్కువ మరణాలున్నట్లు అధ్యయనంలో తేలిందన్నారు. పరీక్షలు ఎక్కువ చేయకపోతే కొవిడ్ మరణాలు లెక్కలోకి రాలేదు. ఈ గణాంకాలన్నింటినీ సరిపోల్చుకొని తాము ఈ అంచనా వేసినట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనారోగ్య సమస్యలపై ఏళ్లతరబడి పనిచేస్తున్న అనుభవంతో ఈ లెక్కలు వేసినట్లు వెల్లడించారు. 155 దేశాల్లో 6,500 మందితో కలిసి తాము పనిచేస్తున్నట్లు ఐహెచ్‌ఎంఈ వివరించింది.
భవిష్యత్తులో…
రాబోవు కాలంలో కరోనా నష్టంపై ఈ నివేదిక మరో బాంబు పేల్చింది. ఇప్పటి నుంచి సెప్టెంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందని, అందులో సగం వరకు భారత్‌లోనే ఉండే ప్రమాదముందని అధ్యయనంలో వెల్లడైనట్లు ఐహెచ్‌ఎంఈ చెబుతోంది. సంస్థ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ జేఎల్ ముర్రే తమ అధ్యయనం వివరాలను ఇటీవలే వెల్లడించారు.
కరోనాపై ఈ సంస్థ అధ్యయనం ప్రకారం కొన్ని దేశాల ప్రభుత్వాలు వెల్లడించిన మరణాలు, వాస్తవ మరణాలు… మే 3 నాటికి నమోదైన అత్యధిక మరణాలు నమోదైన దేశాలలోని వాస్తవ గణాంకాలు…ఇలా వున్నాయి.
దేశం ప్రభుత్వాలు లెక్కలు వాస్తవ మరణాల అంచనా
భారతదేశం 2,21,181 6,54,395
అమెరికా 5,74,043 9,05,289
మెక్సికో 2,17,694 6,17,127
బ్రెజిల్ 4,08,680 5,95,903
బ్రిటన్ 1,50,519 2,09,661
రష్యా 1,09,334 5,93,614
Also Read: AP Corona Cases: ఏపీలో కొత్తగా 22,517 కరోనా పాజిటివ్ కేసులు.. ప్రమాదకరంగా మరణాలు