America: పోలీసుల దౌర్జన్యం.. మరోసారి నల్ల జాతీయుడి మృతి.. అగ్రరాజ్యంలో పెల్లుబికిన నిరసన జ్వాలలు..

|

Jan 28, 2023 | 9:50 PM

అగ్రరాజ్యం అమెరికాలో మరో అమానవీయ ఘటన జరిగింది. పోలీసుల దౌర్జన్యంతో మరోసారి నల్లజాతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. టయిర్‌ నికోలస్ మృతిపై అమెరికాలో చాలాచోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. పోలీసులపై..

America: పోలీసుల దౌర్జన్యం.. మరోసారి నల్ల జాతీయుడి మృతి.. అగ్రరాజ్యంలో పెల్లుబికిన నిరసన జ్వాలలు..
Protest In America
Follow us on

అగ్రరాజ్యం అమెరికాలో మరో అమానవీయ ఘటన జరిగింది. పోలీసుల దౌర్జన్యంతో మరోసారి నల్లజాతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. టయిర్‌ నికోలస్ మృతిపై అమెరికాలో చాలాచోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. పోలీసులపై మర్డర్‌ కేసు నమోదు చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. అమాయకుడిని బలి తీసుకున్న పోలీసులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మెంఫిస్‌ నగరంలో ఈ నెల 7న రాత్రి మెంఫిస్‌ నగరంలో టయిర్‌ నికోలస్ అనే 29 ఏళ్ల నల్లజాతీయుడు తన కారులో వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఏ కారణం చెప్పకుండానే అతడి వాహనానికి తమ వాహనం అడ్డుపెట్టి అతడిని కారులోంచి బయటికి ఈడ్చుకొచ్చారు. తరువాత ఇష్టారీతిన కాళ్లతో తన్నారు. మోకాళ్లపై నిలబెట్టి ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. ఆ తర్వాత అతడిని రోడ్డు మీదే వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ రోడ్డుపై స్తంభానికి అమర్చి ఉన్న రిమోట్‌ కెమెరాలో రికార్డయ్యాయి.

ఐదుగురు పోలీసులు నికోలస్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. అమ్మా.. అమ్మా.. వదిలేయండి.. అని పదేపదే ప్రాధేయపడినప్పటికి పోలీసులు వినలేదు. దాడిలో తీవ్రంగా గాయపడిన నికోలస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దాంతో పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలంటూ అమెరికాలోని పలు నగరాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సకాలంలో నికోలస్‌ను ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాలు దక్కేవి. పోలీసులు నికోలస్‌ను కొట్టిపడేసినప్పటి నుంచి అంబులెన్స్‌ వచ్చే వరకు 23 నిమిషాల సమయం గడిచిపోయినట్లు వీడియో రికార్డుల్లో నమోదయ్యింది. దాంతో అతని పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 10న ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకింది. ఫ్లకార్డులు చేతబూని రోడ్లపైకి వచ్చారు. పోలీసులు తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు.

ఈ ఘటనపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దాంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. పోలీసుల అనుచిత ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నికోలస్ పై పోలీసులు దాడి చేసిన వీడియోలు తాను చూశానని, అవి తనను చాలా బాధించాయని చెప్పారు. బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. మరోవైపు నికోలస్ ను విచక్షణా రహితంగా కొట్టిన ఆఫీసర్లు కూడా నల్లజాతీయులే కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..