ఇరాన్ ఉద్రిక్తతలు- వాషింగ్టన్ వ్యూహాన్ని తప్పుబట్టిన బీజింగ్!

ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా మరోసారి ఆంక్షల అస్త్రాన్ని సంధించారు. అయితే, ఈసారి అమెరికా బెదిరింపులకు  ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదంటోంది ఇరాన్. ఆంక్షలు సమస్యను పరిష్కరించలేవని చైనా విదేశాంగ శాఖ ప్రకటన జారీ చేసింది.

ఇరాన్ ఉద్రిక్తతలు- వాషింగ్టన్ వ్యూహాన్ని తప్పుబట్టిన బీజింగ్!
China Warns America Against Imposing New Sanctions On Iran

Updated on: Aug 25, 2026 | 2:32 PM

చైనా, రష్యా కూడా అమెరికా ఏకపక్ష ఆంక్షలను అస్సలు ఆమోదించవని ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానిజాధ్ స్పష్టం చేశారు. “శత్రువులు మాపై ఆర్థిక ఉగ్రవాద దాడి చేయాలని చూస్తున్నారు. కానీ మా దగ్గర కూడా ప్రత్యామ్నాయ అస్త్రాలున్నాయి. మా వ్యూహం ఇకపై కేవలం డిఫెన్స్ కాదు. ఎదురుదాడికి సిద్ధం కావాల్సిందే” అన్నారు. ఆయన వ్యాఖ్యలు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.

ఇరాన్‌ పై అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ సరికొత్త ఆర్థిక ఆంక్షలను ప్రకటించారు. ఈ ప్యాకేజీని ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌క్యాస్ట్’‌గా అభివర్ణించిన ఆయన, అవి టెహ్రాన్‌పై ఒక ‘ఆర్థిక డి-డే’ లాంటివని హెచ్చరించారు. కఠిన ఆంక్షల పరిధిలోకి డిజిటల్ ఆస్తులు, టెక్నాలజీ, బంగారం, విమానయానం, నౌక రవాణా వంటి కీలక రంగాలు వచ్చాయి. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలు తీవ్ర ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరింపులకు దిగారు.

ఈ దెబ్బతో ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వాములు భయపడి తమ సంబంధాలను తెంచుకుంటాయని వాషింగ్టన్ భావించింది. ముఖ్యంగా ఇరాన్ చమురు వ్యాపారానికి వెన్నెముకగా ఉన్న చైనాను ఈసారి టార్గెట్ చేస్తారని అందరూ భావించారు. కానీ ప్రస్తుతానికి 60 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకలపై మాత్రమే ఆంక్షలు విధించింది అమెరికా. చైనా సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

ఆంక్షలు పరిష్కారం కాదు: చైనా 


ఇరాన్‌పై ట్రంప్ కఠిన ఆర్థిక ఆంక్షలు, ఒత్తిళ్లు సమస్యను ఏ మాత్రం పరిష్కరించలేవని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం లేకుండా, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఏకపక్షంగా విధించే ఆంక్షలను తాము వ్యతిరేకిస్తామని చైనా పేర్కొంది. సంబంధిత దేశాలన్నీ బాధ్యతాయుతంగా ప్రవర్తించి, కేవలం రాజకీయ, దౌత్యపరమైన మార్గాల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని చైనా పిలుపునిచ్చింది.

అమెరికా ఆంక్షలను చైనా, రష్యా నిజంగానే ధిక్కరిస్తాయా? ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులకు దిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మళ్లీ ఆకాశాన్ని అంటుతాయా? దశాబ్దాలుగా ఆంక్షల ఉచ్చులో నలిగిపోతున్న ఇరాన్ఈ సారి ట్రంప్ వ్యూహాన్ని ఎలా ఎదుర్కొంటుంది? ఈ ప్రశ్నలు ప్రస్తుతం ప్రపంచదేశాలలో ఉత్కంఠ ను పెంచుతుండగా ఇరాన్,  అమెరికా పోరులో రాబోయే రోజుల్లో ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయో అని ప్రపంచం గమనిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us