
గతంలో చైనా అమలు చేసిన ఒకే బిడ్డ విధానంతో దేశంలో భారీగా యువతుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో పెళ్లి చేసుకోవడానికి ఆ దేశంలో యువతుల కొరత ఏర్పడింది. ఈ కారణంగా వివాహాల కోసం బంగ్లాదేశ్ నుంచి యువతులను అక్రమరవాణా చేస్తున్నారని ఇటీవల చైనా మీడియాలో కథనాలు వచ్చాయి. దేశంలో అక్రమ వివాహాలు జరుగుతున్నట్టు గుర్తించిన చైనా.. వాటిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది.ఈ క్రమంలో దేశంలోని యువతకు కీలక సూచనలు జారీ చేసింది. దేశ సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ యువతులను వివాహాలు చేసుకొవద్దని హెచ్చరించింది. ఈ తరహా వివాహాలు చేసుకుంటే.. మానవ అక్రమరవాణా కింద చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చైనా రాయబార కార్యాలయం హెచ్చరకలు జారీ చేసింది.
దేశంలోని చట్టాలకు వ్యతిరేకంగా సరిహద్దు దాటి వివాహ సేవలు అందింస్తున్న ఏజెన్సీలపై చైనా నిషేధం విధించింది. ఈ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ యువతులతో ప్రేమ లేదా వివాహ మోసాల బారిన పడిన బాధితులు దేశంలోని ప్రజా భద్రతా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించింది.
సరిహద్దు దాటి అక్రమ వివాహాలు చేసుకున్న వారిపై మానవ అక్రమ రవాణా ఆరోపణలతో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని రాయబార కార్యాలయం తెలిపింది. బంగ్లాదేశ్ యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ చట్టం ప్రకారం, మానవ అక్రమ రవాణాకు పాల్పడేతే కనీసం ఏడేళ్ల జైలు శిక్షతో పాటు కొన్ని సందర్భాల్లో జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉందని తెలిపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..