China New Conspiracy: సరిహద్దులో చైనా మరో కుట్ర.. టిబెట్ ఏరియాలో కొత్త ప్రాజెక్టుకు డ్రాగన్ శ్రీకారం

ఇండియా బోర్డర్‌కు సమీపంలో ఆధునిక వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా మన దేశ సైనిక స్థావరాలను దగ్గరి నుంచి, అత్యంత వేగవంతమైన నెట్ వర్క్ ద్వారా పసి గట్టేందుకు..

China New Conspiracy: సరిహద్దులో చైనా మరో కుట్ర.. టిబెట్ ఏరియాలో కొత్త ప్రాజెక్టుకు డ్రాగన్ శ్రీకారం
India China Border With 5g.2

Updated on: Apr 13, 2021 | 4:07 PM

China New Conspiracy on Indian border: మన దేశ సరిహద్దుకు సమీపంలో చైనా (CHINA) మరో కొత్త కుట్రకు తెరలేపింది. గత సంవత్సరం మే నెలలో సరిహద్దులో బలగాల మోహరించి.. మన జవాన్లను కవ్వించడం ద్వారా దాదాపు యుద్ధ వాతావరణాన్ని సృష్టించిన డ్రాగన్ కంట్రీ (DRAGON COUNTRY).. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ (ARUNACHAL PRADESH) సరిహద్దుకు సమీపంలో కొత్తగా కృత్రిమ గ్రామాలను నిర్మించడం ప్రారంభించింది. ఆ తర్వాత తాజాగా ఇండియా బోర్డర్‌ (INDIA BORDER)కు సమీపంలో ఆధునిక వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా మన దేశ సైనిక స్థావరాలను దగ్గరి నుంచి, అత్యంత వేగవంతమైన నెట్ వర్క్ (NETWORK) ద్వారా పసి గట్టేందుకు కొత్తగా కుట్రలు ప్రారంభించింది.

ఇండియా బోర్డర్‌కు అత్యంత సమీపంలోని టిబెట్‌ వద్ద చైనా సరికొత్త 5జీ (5G) కమ్యూనికేషన్‌ సిగ్నల్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. గన్‌బాల రాడార్‌ స్టేషన్ (RADAR STATION)‌లో భాగంగా దీనిని కూడా ప్రారంభించింది. ప్రపంచంలో అత్యంత ఎత్తులో అంటే దాదాపు 5,374 మీటర్ల ఎత్తున నిర్వహిస్తున్న రాడార్‌ స్టేషన్‌ ఇదే. ఈ విషయాన్ని చైనా మిలటరీ వెబ్‌సైట్ (CHINESE MILITARY WEBSITE)‌ స్వయంగా వెల్లడించింది. టిబెట్‌ (TIBET)లోని నగార్జే కౌంటీలో ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తోంది డ్రాగన్ కంట్రీ. ఇది ఇండియా (INDIA), భూటాన్ (BHUTAN)‌ బోర్డర్‌కు సమీపంలో ఉంటుంది. గతేడాది పలు సంస్థలతో కలిసి ఇక్కడ 5జీ స్టేషన్‌ను ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టింది చైనా. బోర్డర్‌లోని చైనా సైనిక దళాలకు కమ్యూనికేషన్‌లో సమస్యలను తొలగించేందుకు ఈ రాడార్ స్టేషన్‌ను వాడుకోవాలని చైనీస్ మిలిటరీ (CHINESE MILITARY) ప్లాన్ చేస్తోంది. ఈ సేవలతో దట్టమైన పర్వతాల్లో ఉన్నా సైనికులకు స్పష్టమైన సిగ్నళ్లను చైనా అందించగలుగుతుంది.

మన దేశంతో వివాదం కొనసాగుతున్న సమయంలో బోర్డర్ వెంట భారీస్థాయిలో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే పనిలో శరవేగంగా చర్యలను చేప్టటింది చైనా. ఉద్రిక్తతలు అధికంగా ఉన్న పాంగాంగ్‌ సరస్సులోని సౌత్ ఏరియా వరకు కేబుళ్లను వేసేందుకు అప్పట్లో భారీ ఎత్తున తవ్వకాలు ప్రారంభించింది. ఈ విషయాన్ని భారత సైనిక అధికారులు ధ్రువీకరించారు. ‘‘వేగవంతమైన సమాచారం కోసం చైనా ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ వేయడం ఆందోళన కలిగిస్తోంది’’ అని అప్పట్లో ఓ భారత అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేబుళ్ల ద్వారా సరిహద్దుల్లోని దళాలకు వెనుకనున్న సైనిక స్థావరాల నుంచి సురక్షితమైన సమాచారం అందుతుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు దృశ్యాలను, డాక్యుమెంట్లను పంపించుకోవచ్చు. ‘‘రేడియోలో మాట్లాడితే దొరికిపోవచ్చు. సంకేతాలను అడ్డుకోవచ్చు. ఆప్టికల్‌ ఫైబర్‌తో అలాంటి పరిస్థితి ఉండదు. సమాచారం సురక్షితంగా ఉంటుంది’’ అని ఆ అధికారి వివరించారు.

భారత బోర్డర్‌లో చైనా గగనతల రక్షణ వ్యవస్థలను గతంలో మోహరించింది. వాటిని ఇప్పటికీ కొనసాగిస్తోంది. భారత దళాలు వీటిపై ఓ కన్నేసి పెట్టాయని ఆంగ్ల వార్త సంస్థ ఏఎన్‌ఐ (ANI) వెల్లడించింది. హెచ్‌క్యూ (HQ),హెచ్‌క్యూ22 (HQ22) వంటి గగనతల రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే హెచ్‌క్యూ9 (HQ9) కూడా ఇక్కడ ఉంచినట్లు వార్తలొచ్చాయి. ఇది ఎస్‌-300 (S-300) చైనా తయారు చేసిన నకలు. దీని రేంజి 250 కిలోమీటర్లు. వీటిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచినట్లు మన సైనిక వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటు హోటాంగ్‌, కష్గర్‌లోని చైనా వాయుసేన స్థావరాల్లో విమానాల రాకపోకలను గమనిస్తున్నాయి.

కాగా చైనా కదలికలను భారత నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు కేంద్ర రక్షణ, హోం మంత్రిత్వ శాఖలకు చేరవేస్తుండడంతో ఈ 5జీ వ్యవస్థకు సంబంధించిన సమాచారం వెలుగు చూసింది. అయితే మన దేశంలో ఇంకా 5జీని అధికారికంగా ఆమోదించలేదు. కానీ.. రక్షణ వర్గాలకు 5జీ సర్వీసులు వినియోగించుకునే వెసులుబాటును కల్పించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇదే గనక జరిగితే చైనాకు ధీటుగా బోర్డర్‌లో నిఘా పెంచేందుకు రక్షణ శాఖ చర్యలు చేపట్టేందుకు సంసిద్ధంగా వున్నట్లు సమాచారం.

ALSO READ: మానవుని తొలి అంతరిక్ష యాత్రకు 60 ఏళ్ళు.. ఆ ఘనత సాధించిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా?