Brazilian Viper Venom: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. కరోనాను అరికట్టేందుకు రకరకాల ప్రయోగాలు చేశారు పరిశోధకులు. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ఎన్నో రోజులు శ్రమించి చివరకు వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. తాజాగా బ్రెజిల్ పరిశోధకులు పాము విషంతో కరోనా వైరస్‌ను అరికట్టవచ్చని స్పష్టం చేశారు. ప్రాణం తీసే పాము విషాన్ని ఔషధంగా మారిస్తే అదే ప్రాణాలను కాపాడవచ్చని అంటున్నారు పరిశోధకులు. ఇప్పటికే పలు రకాల ఔషధాల తయారీలో కొన్ని సర్పాల విషాన్ని వినియోగిస్తున్నారు. తాజాగా కొవిడ్ మహమ్మారిని కట్టడి చేసే గుణం కూడా ఓ పాము విషంలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాల్ని ‘మాలిక్యూల్స్’ అనే జర్నల్‌లో ప్రచురించారు.
బ్రెజిల్‌లో కనిపించే ఒక రకమైన రక్తపింజరి పాము విషం కణాలు కరోనా చికిత్సలో ఉపయోగపడే అవకాశం ఉందని బ్రెజిల్‌లోని సావోపాలో విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. ఈ పాము విషంలోని ఓ పదార్థం వైరస్ పునరుత్పత్తిని కోతిలో సమర్థంగా అడ్డుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దాదాపు 75 శాతం వరకు వైరస్ పునరుత్పత్తి నిలిచిపోయినట్లు వారు స్పష్టం చేశారు.
కాగా, వైపర్ విషంలోని ఓ ‘పెప్టైడ్’.. కరోనా వైరస్ పునరుత్పత్తిలో కీలక పాత్ర పోషించే ‘పీఎల్‌ప్రో’ అనే ఎంజైమ్‌కు అనుసంధానం అవుతున్నట్లు ప్రొఫెసర్ రఫేల్ గైడో వెల్లడించారు. ఈ క్రమంలో ఇతర కణాలను ఈ పెప్టైడ్ ఏమాత్రం హాని చేయట్లేదని తెలిపారు. యాంటీబ్యాక్టీరియల్ గుణాలున్న ఈ పెప్టైడ్‌ను ప్రయోగశాలల్లోనూ ఉత్పత్తి చేయొచ్చని గైడో తెలిపారు. దీనికోసం అనవసరంగా ప్రకృతిలో ఉండే పాముల్ని హింసించాల్సిన అవసరం లేదన్నారు.
తర్వాత దశ ప్రయోగాల్లో అసలు వైపర్ విషంలోని పదార్థానికి కరోనా వైరస్ కణాల్లోకి ప్రవేశించకుండా తొలి దశలోనే అడ్డుకునే సామర్థ్యం ఉందో.. లేదో.. తేల్చనున్నారు. అలాగే ఎంత డోసులో ఇస్తే ఆ పదార్థం ప్రభావవంతంగా పనిచేస్తుందో కూడా గుర్తించేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. జంతువులపై చేసే ఈ ప్రయోగాలన్నీ సఫలమైతే.. తర్వాత దశలో మానవులపై కూడా వీటిని పరీక్షిస్తామని పరిశోధకులు తెలిపారు.
ఈ వైపర్ సర్పం శాస్త్రీయ నామం ‘జరరకుస్సు’. బ్రెజిల్‌లో కనిపించే అతిపెద్ద సర్పాల్లో ఇదొకటి. దీని పొడవు 2 మీటర్ల వరకు ఉంటుంది. బొలీవియా, పరాగ్వే, అర్జెంటీనా దేశాల్లోనూ ఈ పాములు కన్పిస్తుంటాయి. కాగా, కరోనా వైరస్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందని సరైన ఆధారాలు లేకపోయినా.. వైరస్‌ను అంతం చేసేందుకు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంకా రకరకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.