కెనడాలోని బ్రాంప్టన్ హిందూ దేవాలయంలో జరిగిన హింసాత్మక ఘర్షణకు సంబంధించి పీల్ రీజియన్ పోలీసులు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. పీల్ పోలీసుల అధికారిక ప్రకటన ప్రకారం, 21 డివిజన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, స్ట్రాటజిక్ ఇన్వెస్టిగేషన్స్ టీమ్ (SIT) దర్యాప్తు జరుపుతోంది. బ్రాంప్టన్ ఆలయం వద్ద హింసాత్మక నిరసనలో పాల్గొన్న మరొక వ్యక్తిని అరెస్టు చేశారు.
నవంబర్ 3న, బ్రాంప్టన్‌లోని గోర్ రోడ్‌లోని దేవాలయం వద్ద జరిగిన ప్రదర్శనలో జరిగిన వివాదంపై పీల్ ప్రాంతీయ పోలీసులు స్పందించారు. ప్రత్యర్థి పక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా జరిగిన అనేక సంఘటనలను పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు, వాటిలో చాలా వీడియోలను సేకరించారు. ప్రజలపై దాడి చేయడానికి జెండాలు, కర్రలను ఉపయోగించే వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు. వారిలో బ్రాంప్టన్‌కు చెందిన ఇంద్రజిత్ గోసల్ (35)గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇందర్‌జీత్‌ను అరెస్టు చేశారు. ఆయుధంతో దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. అయితే షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో ఆయన విడుదలయ్యారు. అతను తరువాత తేదీలో బ్రాంప్టన్‌లోని అంటారియో కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో హాజరు కావాల్సి ఉంది. ఈ సంఘటనలకు సంబంధించిన వందలాది వీడియోలను దర్యాప్తు బృందాలు పరిశీలిస్తూనే ఉన్నారని, నేరంలో ప్రమేయం ఉన్న మరికొందరు నిందితులను గుర్తించి తదుపరి అరెస్టులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రకటన పేర్కొంది.
శనివారం, కెనడా ఎంపీ చంద్ర ఆర్య బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయంలో హిందూ భక్తులపై ఖలిస్తానీ తీవ్రవాదుల దాడిని ఖండించారు. ఈ ఘటనను హిందూ-సిక్కు సమస్యగా రాజకీయ నాయకులు తప్పుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
ఇదిలావుంటే, ఈ దాడిని ప్రధాని మోదీ సైతం ఖండించారు. కెనడాలోని భారత హైకమిషన్ కాన్సులేట్ క్యాంపు వెలుపల ‘భారత వ్యతిరేక’ శక్తులు జరిపిన హింసాత్మక దాడిని ఖండించింది. ఆలయంపై దాడి కేసులో నవంబర్ 3, 4 తేదీల్లో జరిగిన నేర ఘటనలపై దర్యాప్తు చేసేందుకు వ్యూహాత్మక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇంత క్లిష్టమైన సమస్య విచారణకు సమయం పడుతుందని, ఒక వ్యక్తిని గుర్తించినప్పుడల్లా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. దీంతో పాటు ఘటనకు సంబంధించిన వందలాది వీడియోలను ఇంకా విశ్లేషిస్తున్నామని, నిందితులను గుర్తించి పట్టుకునే పనిలో ఉన్నామని పోలీసులు కూడా చెబుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..