బోరిస్‌ విజయభేరి..బ్రెగ్జిట్‌కే బ్రిటీష్‌ ప్రజల ఓటు

| Edited By: Srinu

Dec 13, 2019 | 7:18 PM

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు నిజమయ్యాయి. కన్జర్వేటివ్‌ పార్టీ విజయ దుందుభి మోగించింది. బ్రెగ్జిట్‌కే పట్టం కట్టారు బ్రిటన్‌ ప్రజలు. 650 స్థానాలున్న దిగువ సభలో మ్యాజిక్‌ ఫిగర్‌ 326 దాటి 362 సీట్లు సాధించి అధికారం నిలుపుకుంది కన్జర్వేటివ్‌ పార్టీ. టోరీస్‌గా పిలిచే కన్జర్వేటివ్స్‌ గత ఎన్నికలకు భిన్నంగా సంపూర్ణ మెజారిటీని సాధించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ బ్రిటన్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫలితాలు మార్పు దిశగా ఇచ్చిన చారిత్రక విజయం అన్నారాయన.. […]

బోరిస్‌ విజయభేరి..బ్రెగ్జిట్‌కే బ్రిటీష్‌ ప్రజల ఓటు
Follow us on

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు నిజమయ్యాయి. కన్జర్వేటివ్‌ పార్టీ విజయ దుందుభి మోగించింది. బ్రెగ్జిట్‌కే పట్టం కట్టారు బ్రిటన్‌ ప్రజలు. 650 స్థానాలున్న దిగువ సభలో మ్యాజిక్‌ ఫిగర్‌ 326 దాటి 362 సీట్లు సాధించి అధికారం నిలుపుకుంది కన్జర్వేటివ్‌ పార్టీ. టోరీస్‌గా పిలిచే కన్జర్వేటివ్స్‌ గత ఎన్నికలకు భిన్నంగా సంపూర్ణ మెజారిటీని సాధించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ బ్రిటన్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫలితాలు మార్పు దిశగా ఇచ్చిన చారిత్రక విజయం అన్నారాయన.. బ్రిటిష్‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని, బ్రెగ్జిట్‌ను పూర్తి చేస్తామని ప్రకటించారు..బోరిస్‌ వెస్ట్‌ లండన్‌ నుంచి తిరిగి ఎంపీగా ఎన్నికయ్యారు..

ఇక ప్రధాన ప్రతిపక్ష లేబర్‌ పార్టీకి మరోసారి పరాజయమే ఎదురైంది. ఆ పార్టీకి 203 స్థానాలే రావడంతో నిరాశకు గురైన జెరెమీ కార్బిన్‌..ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ లేబర్‌ పార్టీ సారధ్య బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కార్బిన్‌ ఇస్లింగ్‌టన్‌ నార్త్‌ నుంచి తిరిగి ఎన్నికైనా ఆయన మెజారిటీ మాత్రం తగ్గిపోయింది. తృతీయ పక్షంగా గట్టిపోటీ ఇస్తుందనుకున్న యూరోపియన్‌ యూనియన్‌ అనుకూల పార్టీ లిబరల్‌ డెమోక్రటిక్‌ ఘోరంగా చతికిల పడింది. దూకుడుగా ప్రచారం చేసినా 11సీట్లకే పరిమితమైంది. ఆ పార్టీ నాయకురాలు జో స్విన్‌సన్‌ కూడా తన నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు..ఇక స్కాటిష్‌ నేషనల్‌ పార్టీ 48 సీట్లు సాధించి స్కాట్లాండ్‌లో సత్తా చాటింది. డెమోక్రటిక్‌ యూనియన్ పార్టీకి 8 సీట్లు దక్కగా, గ్రీన్‌ పార్టీ-బ్రెగ్జిట్‌ పార్టీలు సత్తా చాటుకోలేకపోయాయి.. మొత్తం పోలైన ఓట్లలో కన్జరర్వేటివ్స్‌ 43.5 శాతం దక్కించుకోగా, లేబర్‌ పార్టీకి 32.4 శాతం దక్కాయి..

కన్జర్వేటివ్స్‌ అధికారం నిలబెట్టుకోవడంతో బోరిస్‌ జాన్సన్‌ మరోసారి ప్రధాని పదవిని చేపట్టనున్నారు. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలగడమే ప్రధాన ఎజెంగా ఈ మధ్యంతర ఎన్నికలు జరిగాయి. బ్రెగ్జిట్ ప్రక్రియ వెంటనే ముగించాలనే అంశంతో ప్రధానంగా బోరిస్ ఎన్నికలకు వెళ్లగా, మరోసారి ఈ అంశంపై రిఫరెండంను నిర్వహించడమే అజెండాగా ప్రతిపక్షాలు ముందుకు వెళ్లాయి. పార్లమెంట్‌లో ఇప్పుడు స్పష్టమైన మెజారిటీ ఉన్నందున బ్రెగ్జిట్‌ త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది