సిరియా, టర్కీలో సంభవించిన భూకంపం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎటు చూసినా శిథిలాలు, వందలాది మృతదేహాలతో కన్నీళ్లు పెట్టించే దృశ్యాలే. కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వాళ్లు, తమ వాళ్లు ఏమయ్యారో తెలియక అల్లాడిపోతున్న వాళ్లు.. ఎటుచూసినా విషాదం, ఎవరిని కదిపినా కన్నీళ్లు. ఇలాంటి విపత్తు సమయంలో జరిగిన ఓ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.
కూలిన భవనం శిథిలాల కింద అప్పుడే పుట్టిన ఓ చిన్నారి చిరంజీవిగా నిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సిరియాలోని జిందరిస్ పట్టణంలో భూకంపం దాటికి కూలిన భవనంలో ఓ మహిళ అప్పుడే బిడ్డకు జన్మనిచ్చి మరణించింది. పేగు కూడా తెంచకముందే తల్లి మరణించిన పసి కందు పుట్టగానే అనాధగా మారింది. చిన్నారి ఏడుపును గమనించిన రెస్కూ సిబ్బంది వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఈ చిన్నారి అనారోగ్యం నిలకడగా ఉంది. తల్లిదండ్రులతో పాటు నలుగురు తోబుట్టువులను కోల్పోయిన పాప అనాధగా మారింది. ఆ చిన్నారికి ఆసుపత్రి వర్గాలు అయా అనే పేరు పెట్టారు. అయా అంటే అరబిక్ భాషలో అద్భుతం అని అర్థం. భారీ విపత్తు నుంచి క్షేమంగా బయటపడ్డందుకు పాపకు ఆ పేరు పెట్టినట్లు ఆసుప్రతి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉంది. తల్లిలేని చిన్నారికి వైద్యురాలి భార్యే పాలు ఇస్తోంది.
ఈ చిన్నారికి సంబంధించిన వార్త ప్రపంచమంతా వ్యాపించడంతో పాపను దత్తత తీసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. తనకు వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని చిన్నారికి చికిత్స అందించిన వైద్యుడు తెలిపారు. అయితే ప్రస్తుతం చిన్నారిని ఎవరికీ ఇచ్చే ఆలోచన లేదని పాప బంధువులు వచ్చే వరకు తానే పెంచుతానని డాక్టర్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సిరియా, టర్కీల్లో సోమవారం సంభవించిన భారీ భూకంపాలలో మృతుల సంఖ్య ఇప్పటివరకు 21,000 దాటింది. రెస్కూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా ఈ విపత్తుల్లో 78,000 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..