ఉత్తర గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చమురు శుద్ధి నగరమైన సియుడాడ్ మాడెరోలో రోమన్ క్యాథలిక్ చర్చిలో సామూహిక ప్రార్ధన సమయంలో చర్చి పైకప్పు కూలిపోవడంతో 11 మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో 60 మంది గాయపడ్డారని తమౌలిపాస్ రాష్ట్ర భద్రతా ప్రతినిధి కార్యాలయం తెలిపింది. చర్చి పైకప్పు కూలిన సమయంలో దాదాపు 100 మంది చర్చిలో ఉన్నారని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదం నుంచి బయటపడిన జోసెఫినా రామిరేజ్.. ,ప్రమాదం గురించి స్పందిస్తూ తన కుటుంబాన్ని మళ్లీ చూస్తానని తాను భావించలేదని ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసింది. ఈ ప్రమాదం నుంచి తాను ఎలా బయటపడ్డానో ఇప్పటికీ గుర్తు లేదని.. అసలు ప్రమాదం గురించి చెప్పలేనని తన పోస్ట్‌లో పేర్కొంది. అంతేకాదు చర్చి లో జరిగిన ప్రమాదం నుంచి తన 3 ఏళ్ల మనవారు సహా ఇతర బంధువులు కూడా ప్రాణాలతో బయటపడ్డారని రామిరేజ్ న్యూయార్క్ టైమ్స్‌తో చెప్పింది.
తమౌలిపాస్ భద్రతా ప్రతినిధి జార్జ్ క్యూల్లార్ మాట్లాడుతూ.. రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని మరెవరూ గాయపడలేదని భావిస్తున్నానని చెప్పారు. ప్రమాద సమయంలో బృందానికి నాయకత్వం వహిస్తున్న చర్చి ఫాదర్ ఏంజెల్ వర్గాస్ మాట్లాడుతూ.. కొంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టారని, మరికొందరు ప్రమాదంలో గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రుల ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
అయితే చర్చి పైకప్పు ఎందుకు కూలిపోయిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ప్రమాదానికి కారణాన్ని గుర్తించేందుకు నిపుణులు వస్తున్నారని క్యూల్లార్ చెప్పారు. అయితే చర్చి నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తాము భావిస్తున్నామని చెప్పారు.
ప్రమాదం జరిగిన తర్వాత రెడ్‌క్రాస్‌తో పాటు రాష్ట్ర పోలీసు, రాష్ట్ర పౌర రక్షణ కార్యాలయం, నేషనల్ గార్డ్‌తో సహా పబ్లిక్ ఏజెన్సీలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని తెలియజేశారు. ఈ ప్రమాదంలో తమ ప్రియమైన కుటుంబ సభ్యులను కోల్పోయిన అన్ని కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు తమౌలిపాస్ గవర్నర్ అమెరికా విల్లారియల్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..