ఆగస్టు సంక్షోభం తర్వాత నాయకత్వ మార్పుతో బంగ్లాదేశ్ తీరు మారిందనుకున్నారు. మతమౌఢ్యం నుంచి బయటపడుతుందనుకున్నారు. కానీ ఆ దేశం మారలేదు. కవ్వింపు చర్యలు ఆగడంలేదు. సేవ, సహనాన్ని ప్రబోధించే ఇస్కాన్ గురువుని అకారణంగా అరెస్ట్‌చేసింది బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వం. చిన్మయ్ కృష్ణదాస్‌ని జైలుకు పంపడమే కాకుండా.. ఆయనపై దేశద్రోహం అభియోగాలు మోపింది. దేశంలో ఇస్కాన్ కార్యకలాపాలపై నిషేధానికి సిద్ధమవుతోంది. దీంతో భారత్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ఆధ్మాత్మిక గురువుపై బంగ్లాదేశ్ దేశద్రోహి ముద్రవేయడంపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తోంది. అక్టోబర్ 30న చిన్మయ్ కృష్ణదాస్ సహా 19 మందిపై చిట్టగాంగ్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హిందూ సమాజం ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాని అవమానించారని ఆయనపై అభియోగం మోపారు. నవంబరు 25న చిన్మయ్‌ని ఢాకా ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. దీంతో ఆయన మద్దతుదారులు, హిందూ సంఘాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ కోర్టు చిన్మయ్‌కి బెయిల్ నిరాకరించటంతో.. మొదలైన నిరసనలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. చిన్మయ్ కృష్ణదాస్ తరపున వాదిస్తున్న ప్రభుత్వ న్యాయవాది హత్యకు గురయ్యారు.
భారతీయుల త్యాగాలతో ఏర్పడిన బంగ్లాదేశ్‌కు ఇప్పుడా దేశంలో హిందువులు, హిందూ ఆలయాలు నచ్చడం లేదు. తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగి తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ పదవి చేపట్టిన తర్వాత ఆ దేశంలో హిందువులపై దాడులు పెరిగిపోయాయి. హసీనాకు వ్యతిరేకంగా తిరుగుబాటు సమయంలోనే మైనారిటీలు లక్ష్యంగా భారీగా లూటీలు, దాడులు జరిగాయి. హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకున్నారు మతోన్మాదులు. చిన్మయ్ కృష్ణదాస్‌ని జైల్లోపెట్టాక.. ఇస్కాన్‌కి వ్యతిరేకంగా జమాతే కార్యకర్తలు బెదిరింపులకు దిగుతున్నారు. 24 గంటల్లో మూసివేయాలని అల్టిమేటం ఇవ్వడమే కాదు.. ఇస్కాన్ ఆలయ బోర్డు కూడా తీసేసి తమ సంస్థ బోర్డు పెట్టుకున్నారు.
చిన్మయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ కార్యకలాపాలతో పాటు హిందువులకు గురువుగా మారారు. బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా తగ్గుతున్న సమయంలో హిందూ ధర్మంపై అవగాహన కల్పించేందుకు ఇస్కాన్ చేస్తున్న ప్రయత్నాలు బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతకు నచ్చడం లేదు. అందుకే ఇస్కాన్‌ని లక్ష్యంగా చేసుకుంది యూనస్ ప్రభుత్వం. ఇస్కాన్‌కు బంగ్లాదేశ్‌లో మొత్తం 65 దేవాలయాలున్నాయి. 50 వేలకు పైగా అనుచరులున్నారు. ఆలయాలపై దాడులతో ఆవేదనకు గురవుతున్న హిందువులకు ఈ మధ్యే ధైర్యం చెప్పారు మహ్మద్ యూనస్. దుర్గా పూజ సందర్భంగా ఢాకేశ్వరి ఆలయానికి వెళ్లి హిందువులకు శుభాకాంక్షలు చెప్పారు. అందరూ సమానమేనని చెప్పారు. ఈలోపే ఇస్కాన్‌పై కన్నెర్ర చేయడానికి.. జమాత్ ఎ ఇస్లామీ ఒత్తిడే కారణమని భావిస్తున్నారు.
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ నాయకుడి అరెస్ట్‌పై భారత్‌లో నిరసనలు మొదలయ్యాయి. ప్రపంచంలో ఏ ఉగ్రవాదంతో ఇస్కాన్‌కు సంబంధం లేదని.. నిరాధార ఆరోపణలు దారుణమని చిన్మయ్ అరెస్ట్‌పై స్పందించింది ఇస్కాన్ సంస్థ. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించాలని ఆ దేశాన్ని కోరుతూ ప్రకటన చేసింది. హసీనాని గద్దెదించాక ఓ లక్ష్యంతోనే బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుంటోంది అక్కడి ప్రభుత్వం. చిన్మయ్ అరెస్ట్‌కి ముందే ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇస్కాన్‌ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు బంగ్లా పోలీసులు. దేశంలో మతపరమైన హింసకు ఇస్కాన్ సభ్యులే కారణమని, భారత నిఘా సంస్థకు వారు అనుబంధంగా పని చేస్తున్నారని ఆరోపించారు. అనేక విపత్తుల్లో బంగ్లా ప్రజలకు అండగా నిలిచిన ఇస్కాన్‌పైనే దేశద్రోహి ముద్రవేశారు.
బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనలతో అశాంతి చెలరేగి మాజీ ప్రధాని షేక్ హసీనా ఆగస్టులో అధికారం కోల్పోయాక భారత్‌తో ఆ దేశ సంబంధాలు క్షీణించాయి. ప్రజల తిరుగుబాటుతో భారత్‌లో ఆశ్రయంపొందుతున్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా. ఇదికూడా బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానికి కంటగింపుగా ఉంది. హసీనా భారత్‌లోనే ఉండటం రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలకు సవాల్‌గా మారింది. షేక్ హసీనా పదిహేనేళ్ల పాలనాకాలంలో సరిహద్దు భద్రత, ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు వంటి వ్యవహారాల్లో కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగా, మిత్రదేశంగా ఉంది బంగ్లాదేశ్ . హసీనా పదవి కోల్పోయిన తర్వాత బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల భద్రతపై భారత్ పదేపదే ఆందోళన వ్యక్తం చేసింది. అయితే భారత వాదనను తోసిపుచ్చుతూ వచ్చిన బంగ్లాదేశ్.. చిన్మయ్ అరెస్ట్‌తో కవ్వింపు చర్యలకు దిగినట్లయింది. అయితే ఇస్కాన్‌పై నిషేధం విధించేందుకు బంగ్లాదేశ్‌లోని ఢాకా హైకోర్టు నిరాకరించింది. ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇస్కాన్ కార్యకలాపాలపై బ్యాన్ విధించాలన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే, ఇస్కాన్ ఇటీవలి కార్యకలాపాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో రిపోర్ట్ ఇవ్వాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించింది.
ముస్లిం దేశమైన బంగ్లాదేశ్‌లో హిందువులు ప్రధాన మైనారిటీలుగా ఉన్నారు. 17 కోట్ల బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు కేవలం 8 శాతం మంది ఉన్నారు. ఆగస్టు 5న షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయాక 50కిపైగా జిల్లాల్లో మైనారిటీలపై వందల సంఖ్యలో దాడులు జరిగాయి. తాజాగా కృష్ణదాస్ అరెస్ట్ తర్వాత మళ్లీ మైనారిటీలపై దాడులు పెరగడంతో భారత్ అప్రమత్తమైంది. ఈ అంశంలో ఐక్యరాజ్యసమితి జోక్యంచేసుకోవాలని కోరారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. జనవరి 2013 నుంచి సెప్టెంబరు 2021 మధ్య బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై కనీసం 3వేలకు పైనే దాడులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. హసీనా ప్రభుత్వాన్ని కూల్చాక మతతత్వశక్తులు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇస్కాన్ టార్గెట్ అయింది.
2021లో ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించారు. బంగ్లా పౌరుల్లో కొందరు అప్పట్లో ఆయన పర్యటనని వ్యతిరేకించారు. పలు చోట్ల హిందూ ఆలయాలపై దాడులు చేశారు. 1964-2013 మధ్య కాలంలో తీవ్ర వివక్షకు గురయ్యారు బంగ్లాదేశ్ హిందువులు. దాదాపు కోటి మందికి పైనే బంగ్లాదేశ్ నుంచి వలస వెళ్లిపోయారు. హసీనా దేశం విడిచి పారిపోయాక మొత్తం బంగ్లాదేశ్‌ని తమ అధీనంలోకి తీసుకోడానికి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు జమాతే ఇస్లామీ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. హిందువులే లక్ష్యంగా దాడులకు పాల్పడేలా ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి. బంగ్లాదేశ్‌లోని హిందువులకు పెద్దదిక్కుగా ఉన్నారు చిన్మయ్ కృష్ణదాస్. దీంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఇస్కాన్ జోక్యం చేసుకుంటోందనే ఆరోపణలతో చివరికి చిన్మయ్‌ని జైల్లోపెట్టింది అక్కడి ప్రభుత్వం.
భారత్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి తీసుకొచ్చేందుకు మధ్యంతర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆమెను తమకు అప్పగించాలని భారత్‌ని కోరతామన్నారు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న నోబెల్ పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయిన సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన ఈ విషయం చెప్పారు. హసీనా పాలనలో జరిగిన హత్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తుతో పాటు ఎన్నికలు నిర్వహించేందుకు తాత్కాలిక ప్రభుత్వం సిద్ధమవుతోంది. హసీనాను అప్పగించే ప్రయత్నాన్ని భారత్ అడ్డుకుంటే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తామని బంగ్లాదేశ్ ఇప్పటికే హెచ్చరించింది. భారత్‌పై ఒత్తిడిపెంచే వ్యూహంలో భాగంగానే ఇస్కాన్‌పై విషం కక్కుతోందనే అనుమానాలు కూడా వస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఇస్కాన్‌పై ఇప్పటిదాకా ఎక్కడా ఏ వివాదాలూ లేవు. చివరికి భారత్‌పై విషంకక్కే పాకిస్తాన్‌లోనూ ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఎక్కడా లేనివిధంగా బంగ్లాదేశ్‌లోనే వివాదం తలెత్తడం చూస్తుంటే.. ఇది కుట్రగానే కనిపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కృష్ణుడి బోధనలను ప్రచారం చేస్తుంది ఇస్కాన్. భగవద్గీత సారాంశాన్ని విశ్వవ్యాప్తం చేయడమే ఈ సంస్థ లక్ష్యం. అదో ఆధ్మాత్మిక ప్రపంచం. బోధనలు, కీర్తనలతో శ్రీకృష్ణ భగవానుడికి నీరాజనం. విదేశీయులను కూడా విపరీతంగా ఆకర్షిస్తోంది ఆ భక్తిభావం. సేవ తప్ప మరో మార్గం తెలీని సంస్థ ప్రతినిధి అరెస్ట్.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్. అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. కృష్ణుడి బోధనలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడమే ఇస్కాన్ ఎంచుకున్న మార్గం.
ఇస్కాన్‌ని స్థాపించింది భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. మొదట ఓ భక్తిసంఘాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు ప్రభుపాద. వైష్ణవ సన్యాసిగా దేశ విదేశాలు తిరుగుతూ ఇస్కాన్‌కి పునాది వేశారాయన. కొన్నేళ్లు బృందావనంలో ఉండి అమెరికాకు వెళ్లిన ప్రభుపాద 1966లో అధికారికంగా ఇస్కాన్‌ని స్థాపించారు. అదే ఏడాది జూలై13న న్యూయార్క్‌లో మొదటి ఇస్కాన్ ఆలయ నిర్మాణం జరిగింది. మొదట్లో సమాజం వెలివేసినవారిని చేరదీసి వారికి బోధనలు చేసి ఇస్కాన్‌లో చేర్పించేవారు. ఆ తర్వాత చూడముచ్చటైన, ప్రశాంతతకు నెలవైన ఇస్కాన్ ఆలయాలను నిర్మిస్తూ వచ్చారు. వయోభారాన్ని కూడా లెక్కచేయకుండా ప్రపంచమంతా పద్నాలుగు సార్లు ఉపన్యాస యాత్ర సాగిస్తూ ఆరు ఖండాలలో పర్యటించారు ప్రభుపాద.
1968లో న్యూవర్జీనియాలో కొండలపై ఆధ్యాత్మిక సమాజాన్ని స్థాపించి దానికి నవ బృందావనం అనే పేరు పెట్టారు ప్రభుపాద. అక్కడే ఒక వైదిక పాఠశాలను ఏర్పాటుచేసి పాశ్చాత్య దేశాలకు వైదిక గురుకుల విద్యావిధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికీ వెయ్యి ఎకరాల్లో విరాజిల్లుతోంది ఆ ప్రాంతం. అమెరికాలోని ఆయన శిష్యులు అలాంటి సంఘాలు ఎన్నో స్థాపించారు. ప్రభుపాద చేసిన ముఖ్యమైన సేవ గ్రంథరచన. ఎనభైకి పైగా భాషల్లోకి ఆయన రచనలను అనువదించారు. ప్రభుపాద గ్రంథాలను ముద్రించేందుకు 1972లో భక్తివేదాంత బుక్ ట్రస్టుని స్థాపించారు. అదిప్పుడు భారతీయ వైదికతత్వ విషయాలపై గ్రంథాలను ప్రచురించే ప్రపంచ ప్రసిద్ధ సంస్థగా రూపొందింది.
చివరిశ్వాసదాకా ఆధ్యాత్మిక చింతనలోనే గడుపుతూ 1977 నవంబరు 14న బృందావనంలో కన్నుమూశారు ఇస్కాన్ వ్యవస్థాపకుడు. కృష్ణ చైతన్య సంఘాన్ని అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్ది తన ఆశయాన్ని నెరవేర్చుకోగలిగారు. భారతదేశంలోనే కాదు అమెరికా, రష్యా, బ్రిటన్, పాకిస్థాన్ వంటి దేశాల్లో కూడా ఉన్నాయి ఇస్కాన్ ఆలయాలు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైనే ఇస్కాన్ ఆలయాలున్నాయి. ఒక్క అంటార్కటికా తప్ప మిగిలిన అన్ని ఖండాల్లో ఇస్కాన్ ఆలయాలున్నాయి. పశ్చిమబెంగాల్‌లోని మాయాపూర్‌లో ఉంది ఇస్కాన్ హెడ్‌క్వార్టర్. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది ఇస్కాన్‌ని అనుసరిస్తున్నారు. హరే కృష్ణ హరే రామ అంటూ ఆధ్యాత్మిక చింతనలో కాలం గడుపుతున్నారు.
ఇస్కాన్ ఆరాధకులకు కృష్ణుడే ప్రపంచం. కీర్తనలు పాడుతూ, హరేకృష్ణ మంత్రాన్ని జపిస్తూ సాగే హారతి అందరినీ తన్మయత్వంలో ముంచెత్తుతుంది. కఠోర నియమాలు పాటిస్తుంటారు ఇస్కాన్ భక్తులు. గుడ్లు, మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఆహారంలో వెల్లుల్లి, ఉల్లిపాయవంటివి తీసుకోకుండా నిష్టగా ఉంటారు. మద్యం, ధూమపానం, జూదంవంటివి దరిచేరనివ్వరు ఇస్కాన్ మార్గాన్ని అనుసరించే భక్తులు. అందుకే పెద్దసంఖ్యలో విదేశీయులు కూడా ఇస్కాన్‌కి ఆకర్షితులై భగవద్గీత ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. వివిధ భాషల్లో పుస్తకాల రూపంలో ప్రవచనాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
ఇస్కాన్ సామాజిక కార్యక్రమాల్లో ఒకటి లైఫ్ ఫర్ లైఫ్ ప్రోగ్రామ్. అవసరమైన వారికి ఉచిత, పోషకమైన శాఖాహార భోజనాన్ని అందించాలనేదే ఈ కార్యక్రమ సంకల్పం. అన్నదానాన్ని పరమపవిత్రంగా, పరోపకారంగా భావించే ఇస్కాన్ సంస్థ.. ఏపీతో పాటు పలురాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథక బాధ్యతలను కూడా చూస్తోంది. ఏటా మిలియన్లమందికి ఆహారాన్ని అందిస్తోంది ఇస్కాన్. ఆ సంస్థకు ఇది ఆకలి తీర్చే కార్యక్రమం కాదు. కరుణ, సమానత్వం, అందరినీ గౌరవించాలనే సందేశాన్ని సమాజానికి ఇవ్వడమే ఇస్కాన్ ఉద్దేశం. సమాజంలో సమభావం పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలకు దోహదపడతాయని ఇస్కాన్ నమ్ముతుంది.
అన్ని జీవులపై కరుణ చూపాలని ప్రబోధిస్తుంది ఇస్కాన్. పర్యావరణ పరిరక్షణలో కూడా తనవంతు భూమిక పోషిస్తోంది. సేంద్రీయ వ్యవసాయం, గోసంరక్షణ, చెట్ల పెంపకం వంటి కార్యక్రమాల్లోనూ ఇస్కాన్ బృందాలు చురుగ్గా పాల్గొంటున్నాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలే కాదు.. ప్రకృతికి అనుగుణంగా ఎలా జీవించాలో కూడా ఇస్కాన్ ప్రచారం చేస్తుంది. గోవులు, ఆదివాసీల సంరక్షణని కూడా ఇస్కాన్ ప్రచారకులు తమ బాధ్యతగా భావిస్తుంటారు. ఇస్కాన్ చుట్టూ ఇంత ప్రపంచం ఉంది కాబట్టే బంగ్లాదేశ్‌లో చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ అంతగా ప్రకంపనలు రేపుతోంది.
ఇస్కాన్‌ని దోషిగా నిలబెట్టేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా.. సంస్థపై నిషేధం విధించేందుకు ఢాకా హైకోర్టు నిరాకరించింది. మరోవైపు ఇస్కాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని, దీనిపై నిషేధం విధించాలని పదిమందితో కూడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందం అక్కడి ప్రభుత్వానికి లీగల్ నోటీసు పంపింది. ఈ పరిణామాలతో.. చిన్మయ్ అరెస్ట్ ఎపిసోడ్ ఏ మలుపు తిరగబోతోందో మరి!
అయితే ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే… బంగ్లాదేశ్‌లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్)ని నిషేధించాలనే డిమాండ్ల మధ్య, దేశద్రోహ ఆరోపణలపై అరెస్టయిన చిన్మోయ్ కృష్ణ దాస్.. సంస్థ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగా చిన్మోయ్ చాలా కాలం క్రితం సంస్థలోని అన్ని పదవుల నుంచి తొలగించారని ఇస్కాన్ బంగ్లాదేశ్ ప్రధాన కార్యదర్శి చారు చంద్ర దాస్ బ్రహ్మచారి చెప్పినట్లు ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. లాయర్ మరణంపై జరుగుతున్న అసత్య ప్రచారాల్ని ఖండించారు. న్యాయవాది మరణం, దేశంలో కొనసాగుతున్న నిరసనలతో బంగ్లాదేశ్ ఇస్కాన్‌కు ఎలాంటి ప్రమేయం లేదని వెల్లడించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ఇస్కాన్ మతపరమైన, ఘర్షణ కార్యకలాపాలలో పాల్గొనలేదని, ఐక్యత సామరస్యాన్ని పెంపొందించడంలో మాత్రమే పాల్గొంటుందని ఆయన వివరించారు.
#Bangladesh | Chinmoy Krishna Das Brahmachari does not belong to us: #ISKCONBangladesh
The organization would not shoulder any responsibility over his statements and speech: Charu Chandra Das Brahmachari, General Secretary, #ISKCON Bangladesh@DhakaPrasar #ChinmoyKrishnaDas… pic.twitter.com/cuaR5SRc6V
— All India Radio News (@airnewsalerts) November 28, 2024
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..