సాహిత్య అభిమానులకు జులెస్ వెర్న్ రాసిన అరౌండ్ ది వరల్డ్ 80 డేస్ అనే నవల గుర్తుంటే ఉంటుంది.. ఆ అడ్వెంచరస్ నవలను ముళ్లపూడి వెంకటరమణ 80 రోజులలో భూ ప్రదక్షణ పేరుతో తెలుగులో అనువదించారు కూడా! ఆ రోజుల్లో అయితే గ్లోబ్‌ను చుట్టిరావడానికి 80 రోజులు పట్టింది కానీ.. ఇప్పుడైతే మూడు రోజుల్లో చుట్టేయొచ్చు.. ప్రపంచ రికార్డు సొంతం చేసుకోవచ్చు.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన డాక్టర్ ఖావ్లా అల్ రొమైతీ అనే మహిళకు ఇలాంటి రికార్డు సాధించాలన్న అభిలాష మెండుగా ఉండింది.. అతి తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుడితే బాగుంటుందని ఆమెకు అనిపించింది. అందుకోసం పకడ్బందీ ప్లాన్ వేసుకుంది.. ఫిబ్రవరి తొమ్మిదో తేదీన ప్రపంచయాత్ర మొదలు పెట్టింది.. ఫిబ్రవరి 13వ తేదీన ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం దగ్గర యాత్రను ముగించింది.. అంటే కేవలం మూడు రోజుల 14 గంటల 46 నిమిషాల, 48 సెకన్లలో ప్రపంచం మొత్తం తిరిగేసింది.. 208 దేశాలను సందర్శించింది. అతి తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుట్టివచ్చినందుకు డాక్టర్ ఖావ్లా ఆల్ రొమైతీ పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. నిన్న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నిర్వాహకులు ఇచ్చిన సర్టిఫికెట్‌తో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.. తనకు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్సు అంటే ఎంతో ఆసక్తి అని, అందుకే ప్రపంచాన్ని చుట్టేశానని ఆమె సంబరంగా చెప్పుకుంది.. గిన్నిస్ బుక్ సర్టిఫికెట్ అందుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది.. యాత్రలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కొన్ని మధురమైన సంఘటను కూడా తారసపడ్డాయని చెప్పింది. ఇంతకు ముందు ఈ రికార్డు ఇద్దరు యాత్రికులు జూలీ బెర్రీ, కాసే స్టివార్ట్ పేరిట ఉండింది.. వారిద్దరు ఏడు ఖండాలను 92 గంటల నాలుగు నిమిషాల 19 సెకన్లలో చుట్టేశారు.. ఇప్పుడా రికార్డు రొమైతీ కారణంగా తుడిచిపెట్టుకుపోయింది.