
అగ్రరాజ్యం అమెరికాను ప్రస్తుతం మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇబ్బంది పెడుతోంది. ఆ దేశంలోని గణితంలో నిష్ణాతులైన ఉద్యోగులు లేరని కొన్ని కంపెనీలు, యూనివర్శిటీలు తమ నివేదికల్లో చెబుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో ఇలాంటి తీరే కొనసాగినట్లైతే ఇక ఆ దేశ జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించడంతో సహా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోటీపడటం కష్టంగా మారుతుందని ఆయా కంపెనీల యాజమాన్యాలు అలాగే కొంతమంది విద్యారంగ నిపుణులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రానున్న 50 ఏళ్లలో ప్రపంచ సాంకేతిక అభివృద్ధి విషయంలో ఇతర దేశాలు కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అయితే అప్పటికి ఆ దేశాల్లో ఉండేటువంటి మేధో సంపత్తి.. అమెరికాలో ఉండే అవకాశం ఉండదు. దీనివల్ల ఇది ఆందోళన కలిగించే విషయమని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని సైకాలజీ, మ్యాథ్స్ ప్రొఫెసర్ జిమ్ స్టిగ్లెర్ పేర్కొన్నారు.
అలాగే విద్యావ్యవస్థకు కూడా తమ వంతు చేయూతను అందించడానికి అమెరికా రక్షణ శాఖ సైన్స్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, మాథ్య్స్ ‘STEM’ అనే పేరుతో ప్రత్యేక కార్యాచరణను ప్రస్తుతం అమలు చేస్తోంది. అయితే ఈ నివేదిక ప్రకారం చూసుకుంటే.. అమెరికన్‌లలో స్టెమ్ కాలేజ్ గ్రాడ్యుయేట్‌లతో పోల్చినట్లైతే చైనాలో ఎనిమిది, రష్యాలో నాలుగు రెట్లు ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మరోవైపు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ నుంచి సెమీ కండక్టర్ తయారీ దాకా ప్రతి రంగంలో కూడా మ్యాథ్స్ అవసరం ఉంటుందని.. కానీ ప్రస్తుతం చూస్తే ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగులు లేరని టేనస్సీ టెక్ యూనివర్శిటీ తమ నివేదికలో వెల్లడించింది. అయితే ఇది కేవలం విద్యా రంగానికి చెందిన విషయం మాత్రమే కాదని.. కొన్ని రంగాల్లో కూడా అమెరికా ఎదుర్కొంటున్నటువంటి ప్రాథమిక సవాళ్లను ఎదుర్కొనేందుకు గణితం అవసరం ఉందని ది ఏస్పేన్ ఇనిస్టిట్యూట్ అనే సంస్థ ఉపాధ్యక్షుడు జోష్ వైనర్ పేర్కొన్నారు.
అలాగే భవిష్యత్తులో అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా కూడా సవాలు చేస్తుందని ఈ సంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు చూసుకుంటే ప్రస్తుతం అగ్రరాజ్యంలో వివిధ కీలక రంగాలకు విదేశాల నుంచి విద్యార్థులుగా వచ్చి ఉద్యోగులుగా మారినటువంటి వారు.. ఈ రంగాలకు నాయకత్వం వహిస్తున్నట్లు పేర్కొంది. అయితే తాజా గణాంకాల ప్రకారం చూసుకుంటే.. అమెరికాలోని పలు యూనివర్శిటీల్లో కూడా మ్యాథ్స్-ఇంటెన్సివ్ సబ్జెక్ట్‌గా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివే ప్రతి ఐదుగురిలో ఒక్కరు మాత్రమే అమెరికన్ ఉన్నట్లు సమాచారం. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. మాథ్య్స్ సబ్జెక్ట్‌లో ఇటీవల నిర్వహించిన ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్‌మెంట్ టెస్ట్‌లో అమెరికాతో పాటు 36 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అయితే ఈ టెస్టులో చైనాకు చెందిన విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించారు. అలాగే అమెరికాలోని గణితంలో ప్రతిభ కనబరచలేని వాళ్లలో ఎక్కువ మంది తక్కువగా జీతాలు పొందుతున్నట్లు స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ ఇప్పటికే ఓ నివేదిలో తెలిపింది.