ఆప్ఘనిస్థాన్‌లో మళ్లీ వైమానిక దాడి చోటు చేసుకుంది. ఆప్ఘనిస్థాన్ బాల్ఖు ప్రావిన్స్ లోని చోమ్తాల్ జిల్లాలో జరిగిన వైమానిక దాడిలో ఏడుగురు తాలిబన్ ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడిలో మరో ఐదుగురు ఉగ్రవాదులు గాయపడ్డారని ఆప్ఘనిస్థాన్ రక్షణ మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది. ఈ వైమానిక దాడిలో ఉగ్రవాదుల ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ధ్వంసం చేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఫరా ప్రావిన్సులోని బోలోక్ జిల్లాలో మరో 8 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమార్చామని తెలిపింది. తాలిబన్ నాయకులు తమ ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు వరుస వీడియోలు వెలువడిన తర్వాత ఈ వైమానిక దాడి జరిపామని వివరించింది.
ఇలా ఆప్ఘాన్‌లో వరుసగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతుండటంతో వైమానిక దళాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఆప్ఘనిస్థాన్‌లో వరస దాడులతో అట్టుడుకుతోంది. తరచూ ఏదో ఒక చోట బాంబు పేలుళ్లు చోటు చేసుకోవడంతో వారి దాడులను వైమానిక దళాలు తిప్పికొడుతున్నాయి. అలాగే డిసెంబర్ 20న కాబూల్‌లో జరిగిన బాంబు పేలుడులో 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం రద్దీ అధికంగా ఉండే సమయంలో నడి రోడ్డుపై బాంబు పేల్చారు ఉగ్రవాదులు. ఇలా ఉగ్రవాదుల వరుస దాడులతో రెచ్చిపోవడంతో వైమానక దాడి చేపట్టి తాలిబన్ ఉగ్రవాదులను హతమార్చారు.