Taliban eleven commandments to media houses: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తాలిబన్లు ఒక్కటొక్కటిగా తమ ఎజెండాలను బయటికి తీస్తున్నారు. ఇందులో భాగంగా అఫ్గానిస్తాన్‌లో పని చేస్తున్న మీడియా సంస్థలకు లెవెన్ కమాండ్‌మెంట్స్‌ని జారీ చేశారు. పత్రికల్లో వచ్చే ఆర్టికల్స్, వాటి సబ్జెక్టులను స్క్రీనింగ్ చేయబోతున్నట్లు సంకేతాలిచ్చారు. ఇస్లాం మతానికి సంబంధించి ఎలాంటి వ్యతిరేకవార్తలు రాయకూడదని హుకుం జారీ చేశారు. తాలిబన్ల ప్రభుత్వంలో కీలక వ్యక్తులకు వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు రాయవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అదేసమయంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేసే మీడియా ఆఫీసు అందించే వార్తలను ప్రచురించాలని, టెలికాస్ట్ చేయాలని నిర్దేశించారు. వార్తల ఎంపిక దగ్గరి నుంచి వార్తల యాంగిల్స్ అన్నీ ప్రభుత్వం మీడియా హౌజ్ నిర్దేశించినట్లుగానే వుండాలని ఆదేశాలు జారీ చేశారు.
అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం మీడియా సంస్థలకు జారీ చేసిన పదకొండు ఆదేశాలకు సంబంధించి అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. తాలిబన్ల హెచ్చరికల నేపథ్యంలో దాదాపు 150 మీడియా సంస్థలు అఫ్గానిస్తాన్‌లో తమ కార్యకలాపాలను నిలిపివేసినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది. మీడియా సంస్థల రోజువారీ కార్యకలాపాలలో తాలిబన్ ప్రభుత్వ అధినేతలు, అధికారుల జోక్యం నానాటికి పెరిగిపోతుండడంతో మీడియా సంస్థలు అఫ్గానిస్తాన్‌లో తమ కార్యకలాపాలను కొనసాగించలేకపోతున్నారని తెలిపింది. మీడియా సంస్థలకు ఉండే సమాచార హక్కు విషయంలో తాలిబన్ సర్కార్ జోక్యం పెరిగిపోతోందని, వార్తలను తమకు నచ్చినట్లు ప్రచురించాలని, టెలికాస్ట్ చేయాలని ప్రభుత్వాధినేతలు మీడియా సంస్థలపై ఒత్తిడి పెంచుతున్నారని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొన్నది. అఫ్గానిస్తాన్‌లో ప్రధాన మీడియా సంస్థ అయిన టోలో సైతం తాలిబన్ ప్రభుత్వం మీడియాపై విధిస్తున్న ఆంక్షలపై నిరసన వ్యక్తం చేసింది. తాజాగా తాలిబన్ ప్రభుత్వం కొన్ని మీడియా సంస్థలను ప్రింటింగ్ నిలిపి వేసి.. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే తమ పత్రికలను అందుబాటులో వుంచాలన్న హుకుం జారి చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి దారుణ స్థితికి పడిపోవడంతోనే ప్రింట్ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.