Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో కీలక పరిణామం.. సొంత గూటికి చేరిన అల్ – ఖైదా కీలక నేత అమిన్-ఉల్-హక్.. ఉలిక్కిపడ్డ ప్రపంచం!

|

Sep 02, 2021 | 8:46 AM

ఆఫ్ఘనిస్తాన్.. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తరువాత.. రోజుకో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. అప్ఘానిస్తాన్ తాలిబన్ చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఉగ్రవాదులు ఊపిరిపీల్చుకుంటున్నారు.

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో కీలక పరిణామం.. సొంత గూటికి చేరిన అల్ - ఖైదా కీలక నేత అమిన్-ఉల్-హక్.. ఉలిక్కిపడ్డ ప్రపంచం!
Amin Ul Haq
Follow us on

Amin Ul Haq returns to Afghanistan: ఆఫ్ఘనిస్తాన్.. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తరువాత.. రోజుకో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. అప్ఘానిస్తాన్ తాలిబన్ చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఉగ్రవాదులు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ సహా పలు దేశాల్లోని ఉగ్రవాదులు అప్ఘానిస్తాన్ కి తమ మకాం మారుస్తుండగా..తాజాగా అల్ ఖైదా ఉగ్రసంస్థకి చెందిన కీలక నేత అమిన్ ఉల్ హక్ అప్ఘానిస్తాన్‌లోని తన సొంత ఊరుకి తిరిగి చేరుకున్నాడు. మరోవైపు, తాలిబన్ల పరిపాలనలో ఆ దేశం మళ్లీ ఉగ్రవాదులకు షెల్టర్ జోన్‌గా మారుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఆప్ఘనిస్తాన్‌ను వదిలి వెళ్లిన ఉగ్రవాదులందరూ మళ్లీ స్వదేశానికి చేరుకుంటున్నారు. తాజాగా అల్ ఖైదా కీలక నేత అమీనుల్ హక్.. ఆప్ఘనిస్తాన్‌లో అడుగు పెట్టారు. తన సొంత రాష్ట్రం నంగర్‌హర్ ప్రావిన్స్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆప్ఘనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన కొద్దిరోజులకే ఆయన స్వస్థలానికి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే అమిన్ ఉల్ హక్ ని వాహ‌నంలో రావ‌డం చూసిన అక్కడి తాలిబ‌న్ల‌లో కొంద‌రు.. సెల్ఫీలు దిగ‌డానికి ఎగ‌బ‌డడం విశేషం.


కాగా, ఒకట్రెండు రోజుల్లో అమీనుల్ హక్.. కాబుల్‌కు వెళ్తారని విదేశీ మీడియా అంచనా వేస్తోంది. తాలిబన్ల కీలక నేతలతో భేటీ అవుతారని వార్తలు వెలువడుతున్నాయి. అమిన్ ఉల్ హక్..2001లో న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ ట‌వ‌ర్ల‌పై దాడిలో ప్రధాన సూత్రధారి. అమీనుల్ హక్.. ఒసామా బిన్ లాడెన్‌కు ముఖ్య అనుచరుడు. లాడెన్ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ కూడా. లాడెన్ ఎక్కడికి వెళ్లినా.. అతని వెంటే ఉండేవాడు. 2008లో అతణ్ని పాకిస్తాన్ భద్రతాధికారులు అరెస్ట్ చేశారు. 2011లో విడుదల చేశారు. సుదీర్ఘకాలం పాటు తాలిబన్లతో కలిసి పనిచేసిన అనుభవం అమీనుల్ హక్‌కు ఉంది. ఇదివరకు తాలిబన్ల ప్రభుత్వం ప్రిసనర్ కమిషన్‌లో సైతం అతను పనిచేశాడు. ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా భద్రతా బలగాలు పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో మట్టుబెట్టిన తరువాత తెరమరుగయ్యాడు. అమెరికా సైన్యం అమీనుల్ హక్ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ జాడ దొరకలేదు.

అయితే, తాజా ఆప్ఘానిస్థాన్‌లో పరిణామాల నేపథ్యంలో మళ్లీ తెర మీదకి వచ్చాడు. తన స్వస్థలం నంగర్‌హర్ ప్రావిన్స్‌కు చేరుకున్నాడు. త్వరలోనే తాలిబన్లతో భేటీ కాబోతోన్నాడు. ఇదివరకట్లాగే తాలిబన్ ప్రభుత్వంతో అసోసియేట్ అవుతాడనే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ చెలరేగిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆగ్నికి ఆజ్యం పోసినట్టు.. అల్ ఖైదా కూడా చాపకింద నీరులా తోడవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలను చూస్తుంటే ఉగ్రవాదులందరూ మళ్లీ తాలిబన్లతో జట్టు కట్టడానికి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తుంది. ఇది ఎక్కడికి దారి తీస్తాయోననే భయాందోళనలకు కారణమవుతున్నాయి. భారత్ సహా అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఒకింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందనే రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also…  Punjab National Bank: పంజాబ్ నేషన్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. ఆఫర్లే ఆఫర్లు.. పూర్తి వివరాలు మీకోసం..