Panjshir vs Talibans: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన నాటినుంచి అరచకాలు పెట్రేగుతున్నాయి. నిత్యం తాలిబన్లు ప్రజలపై దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రజల పట్ల క్రూర మృగాల్లా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఆ దేశంలో ఆధిపత్యపోరు నెలకొంది. ఆఫ్ఘన్ ప్రతిఘటన దళాలు, తాలిబన్లకు మధ్య అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ లోని పంజ్‌షీర్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు నిన్న తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనను పంజ్‌షీర్ తిరుగుబాటు దళం తీవ్రంగా ఖండించింది. తాలిబన్లతో యుద్ధం కొనసాగుతున్నదని పంజ్‌షీర్ ఇంకా వారికి లొంగిపోలేదని స్పష్టంచేసింది. ఈ మేరకు పంజ్‌షీర్ తిరుగుబాటు దళం సంచలన ప్రకటన చేసింది.
ఈ యుద్ధంలో 6 వందలమందికిపైగా తాలిబన్లను మట్టుబెట్టినట్టు పంజ్‌షీర్ దళం ప్రకటించుకుంది. 600 మంది తాలిబన్ ఫైటర్లను పంజ్‌షీర్ యోధులు అంతమొందించారని ప్రకటనలో పేర్కొంది. అలాగే వెయ్యి మందికి పైగా తాలిబన్లు తమకు లొంగిపోయారని తెలిపింది. అయితే.. ఈ ప్రకటన పంజ్‌షీర్ తిరుగుబాటు దళ ప్రతినిధి ఫహీం దష్టి నుంచి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
అయితే.. ఆఫ్ఘన్‌లోని పంజ్‌షీర్‌పై ఆధిపత్యం సాధించామని తాలిబన్లు ప్రకటించిన మరునాడే.. 6వందల మంది తాలిబన్లను మట్టుబెట్టినట్లు పంజ్‌షీర్ దళం చేసిన ప్రకటనలతో అంతటా గందరగోళం నెలకొంది. అసలు వాస్తవ పరిస్థితి ఏమిటనే చర్చ జోరుగా సాగుతోంది. పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో ప్రస్తుతం గందరగోళం ఏర్పడింది. అయితే.. దేశం మొత్తం ఆక్రమించిన తాలిబన్లు.. పంజ్‌షీర్ ప్రావిన్స్‌పై మాత్రం పైచేయి సాధించలేకపోయారు. ఎందుకంటే.. అక్కడ తాలిబన్లకు వ్యతిరేకంగా దళం పోరాటం చేస్తోంది.
Also Read: