4 Chinese Men Eat Oranges:లక్ష రూపాయలు పెట్టి గేదెను కొన్న వ్యక్తి.. వంద రూపాయలు పెట్టి గేదెను కట్టడానికి తాడు కొనలేక పోయాడంట.. అని పెద్దలు ఎవరైనా కక్కుర్తితో పనులు చేస్తుంటే సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు. ఈ సందర్భాన్ని గుర్తుకొచ్చేలా చేసిందో సంఘటన. విమానంలో అదనపు లగేజీకి ఎక్కువ చార్జ్ చేస్తారనే కారణంతో నలుగురు వ్యక్తులు 30 కిలోల నారింజ పండ్లు లాగేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే..
చైనాలోని యునాన్ ప్రావిన్స్ కు చెందిన వాంగ్ అనే వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి విమానయానానికి సిద్ధమయ్యాడు. అయితే వారి దగ్గర మరీ ఎక్కువ లగేజ్ ఉంది. ఆ లగేజీలో 30 కిలోల నారింజలు కూడా ఉన్నాయి. ఎయిర్‌పోర్టు నిబంధనల ప్రకారం పరిమిత లగేజీ కంటే ఎక్కువ బరువు ఉంటే దానికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీంతో అక్కడి సిబ్బంది వీరి దగ్గర ఉన్న సామాను బరువు రీత్యా 300 యుయాన్లు అంటే భారత కరెన్సీ లెక్కలో రూ.3,384 లగేజీ ఛార్జ్ గా చెల్లించామన్నారు.
దీంతో ఆ యువకులు అంత డబ్బు చెల్లించాలా అనుకుని ఓ ఉపాయం ఆలోచించారు. డబ్బులు కట్టడానికి బదులు బరువు తగ్గించుకుంటే సరిపోతుందని భావించారు. దాంతో వారికొక మహత్తరమైన ఐడియా తట్టింది. వారికి లగేజీ చార్జీలు కట్టడం కంటే వాటిని తినేయడమే మేలని అనుకున్నారు. వెంటనే బ్యాగులు తెరిచి అందులో ఉన్న ముప్పై కిలోల నారింజ పళ్లన్నీ నలుగురూ తినడం మొదలు పెట్టారు. కేవలం 20-30 నిమిషాల్లోనే పళ్లన్నింటినీ స్వాహా అనిపించారు.
దీంతో లగేజీకి డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు.. జేబు ఖాళీ అవలేదు అని సంతోష పడ్డారు.. అయిదు ఆ సంతోషం వారికి ఎక్కువ సేపు నిలవలేదు. వారికి తర్వాతే అర్థమైంది అన్ని నారింజలు తింటే జరిగే అనార్థాలేమిటో.. ఒకేసారి ఎక్కువ మోతాదులో నారింజ ఫలాలను తినడంతో వారి నోటిలో పూత ఏర్పడి మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏదేమైనా ఈ ఘటన ప్రస్తుతం చైనాలో వైరల్‌గా మారింది. వాళ్ల కక్కుర్తిని కొందరు తిట్టిపోస్తుంటే ‘ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందయ్యో!’ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రయాణాలు చేసే వ్యక్తులు… 300 యువాన్ల కోసం కక్కుర్తి పడటం విశేషం.
Also Read: అబార్షన్లను నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చిన యూరోపియన్ దేశం.. రద్దు చేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు