Afghanistan: హిజాబ్ ధరించకుండా మహిళలు ఆ ప్రాంతానికి వెళ్లకూడదు.. తాలిబాన్లు కీలక నిర్ణయం

|

Aug 28, 2023 | 5:04 PM

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారం కైవసం చేసుకున్న తర్వాత అక్కడి మహిళలపై వారు కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. కొద్ది నెలల క్రితం మహిళలను మాధ్యమిక విద్యతోపాటు, యూనివర్శిటీలో చదువులకు దూరం చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇది ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. చాలాదేశాలు తాలిబన్లు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ తర్వాత దూర ప్రయాణాలు, బ్యూటీ సెలూన్లపై వారు నిషేధం విధించారు.

Afghanistan: హిజాబ్ ధరించకుండా మహిళలు ఆ ప్రాంతానికి వెళ్లకూడదు.. తాలిబాన్లు కీలక నిర్ణయం
Women
Follow us on

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారం కైవసం చేసుకున్న తర్వాత అక్కడి మహిళలపై వారు కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. కొద్ది నెలల క్రితం మహిళలను మాధ్యమిక విద్యతోపాటు, యూనివర్శిటీలో చదువులకు దూరం చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇది ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. చాలాదేశాలు తాలిబన్లు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ తర్వాత దూర ప్రయాణాలు, బ్యూటీ సెలూన్లపై వారు నిషేధం విధించారు. అయితే తాజాగా.. హిజాబ్‌ ధరించని మహిళలను బమియాన్‌లో ఉన్నటువంటి బంద్‌-ఈ-అమిర్‌ అనే జాతీయ పార్కుతో పాటు దేశంలోని ఇతర జాతీయ పార్కుల్లోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని తాలిబన్‌ ప్రభుత్వం వైస్‌ అండ్‌ వర్చ్యు మినిస్ట్రీ (ఇస్లామిక్‌ చట్టాల అమలు శాఖ) మంత్రి మహ్మద్‌ ఖలీద్‌ హనాఫీ సిబ్బందికి సూచనలు చేశారు.

మరో విషయం ఏంటంటే మహిళలు అసలు పార్కులను సందర్శించడం తప్పనిసరి కాదని హనాఫీ అన్నారు. హిజాబ్‌ సరిగా ధరించని మహిళలను జాతీయ పార్కులోకి అనుమతించకూడదని సిబ్బందికి ఆదేశించారు. ఎవరైనా బలవంతంగా లోపలికి రావాలని అనుకున్నట్లైతే.. వారిని అడ్డుకునేందుకు అవసరమైతే బలప్రయోగం కూడా చేయాలని ఆదేశించినట్లు తాలిబన్‌ అధికార ప్రతినిధి మహ్మద్‌ సాధిఖ్‌ అఖిఫ్‌ పేర్కొన్నారు. మహిళలు ఇంటి నుంచి బయటికి వచ్చేప్పుడు ఇస్లామిక్‌ నిబంధనలను సరిగా పాటించడంలేదని అన్నారు. అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా అఫ్ఘానిస్థాన్‌లోని మహిళల స్వేచ్ఛ కోసం హ్యుమన్‌ రైట్‌ వాచ్‌ సంస్థ ప్రతినిధి హీథర్‌ బార్‌ పోరాడుతూనే ఉన్నారు. అయితే తాజాగా తాలిబన్లు హిజాబ్ లేకుండా మహిళలు పార్కుల్లోకి ప్రవేశించకూడదనే నిర్ణయం తీసుకోవడంతో.. హీథర్‌ బార్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

దీంతో ఈ నిర్ణయం తీసుకున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబన్లు అధికారం చేపట్టిన అనంతరం అక్కడి మహిళలను విద్య, ఉద్యోగం, క్రీడలు నుంచి పూర్తిగా దూరం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు ప్రకృతి, పార్కుల నుంచి దూరం చేయాలని అనుకుంటున్నారని అన్నారు. ఇది ప్రణాళికా బద్ధంగా మహిళల స్వేచ్ఛను హరించడమే అవుతుందని ఆరోపించారు. అఫ్గానిస్థాన్‌లో మహిళలపై ఆంక్షలు విధించడం వల్ల ఇప్పటికే అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అలాగే తాలిబన్లు మహిళలు స్వేచ్ఛను హరించే నిబంధనలపై అక్కడ మహిళలు ఆందోళనలు కూడా చేస్తున్నారు. తమకు స్వేచ్ఛ కల్పించాలంటూ నిరసనలు చేపడుతున్నారు. అయితే మహిళల ఆందోళనలు, నిరసనలను మాత్రం తాలిబన్లు హింసాత్మకంగా అణిచివేస్తున్నారు. తాలిబన్ల నుంచి అఫ్ఘాన్ మహిళలకు ఎప్పుడు స్వేచ్ఛ దొరుకుతుందోనని చాలామంది ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..