పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత.. ఘోర నిర్లక్ష్యం అంటూ భారత్‌ ఆగ్రహం

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్, నారోవాల్ జిల్లా పరిధిలోని సిరాజ్ గ్రామంలో శతాబ్దపు చరిత్ర కలిగిన చారిత్రక హిందూ దేవాలయం కూల్చివేత ఘటన అంతర్జాతీయంగా పెద్ద వివాదంగా మారింది. మైనార్టీల ప్రార్థనా స్థలాల భద్రతలో పాకిస్థాన్ ప్రభుత్వ ఘోర వైఫల్యం, నిర్లక్ష్యంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐక్యరాజ్యసమితి వేదికగా, అంతర్జాతీయ స్థాయిలో నిరసనను వ్యక్తం చేసింది.

పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత.. ఘోర నిర్లక్ష్యం అంటూ భారత్‌ ఆగ్రహం
Pakistan Hindu Temple Demolished

Updated on: Sep 03, 2026 | 11:13 AM

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్, నారోవాల్ జిల్లా సిరాజ్ గ్రామంలో 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పురాతన హిందూ దేవాలయాన్ని కూల్చివేయడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విధ్వంసాన్ని తీవ్రంగా ఖండిస్తూ, మైనార్టీల ప్రార్థనా మందిరాల పరిరక్షణలో పాక్ అధికారుల నిర్లక్ష్యం దిగ్భ్రాంతికరంగా ఉందని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ ఘటనపై పారదర్శక విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే కూల్చివేసిన ఆలయాన్ని వెంటనే పునరుద్ధరించాలని భారత్ డిమాండ్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

లారూర్ నుండి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరాజ్ గ్రామంలో సుమారు 100 నుండి 125 ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ దేవాలయం ఉంది. నివేదికల ప్రకారం, ఆగస్టు 21న ఈ ఆలయాన్ని కూల్చివేశారు. పక్కనే ఉన్న మదర్సాను విస్తరించేందుకు, ఆ స్థలాన్ని ఆక్రమించే ఉద్దేశంతోనే స్థానిక తీవ్రవాద శక్తులు ఈ విధ్వంసానికి పాల్పడ్డారని పాకిస్థాన్ మసీహా మిల్లత్ పార్టీ, స్థానిక హిందూ వర్గాలు ఆరోపించాయి. ఆలయ శిఖరం, ఇటుకలు, లోహ భాగాలను కూడా తీసుకెళ్లారని వారు తెలిపారు. అయితే, భారీ వర్షాల కారణంగానే ఆలయం కూలిపోయిందని పాక్ అధికారిక సంస్థ ఎవాక్యుయీ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ వ్యాఖ్యానించడం గమనార్హం.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ ఘటనపై ప్రకటన విడుదల చేస్తూ చారిత్రక హిందూ దేవాలయం ధ్వంసం కావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. మైనార్టీల ప్రార్థనా స్థలంపై జరిగిన ఈ ఘోర విధ్వంసాన్ని భారత్ నిస్సందేహంగా ఖండిస్తోంది. పాకిస్థాన్‌లో మైనార్టీ కమ్యూనిటీలు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయో, వారి మత స్వేచ్ఛపై ఎలాంటి ఉల్లంఘనలు జరుగుతున్నాయో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది అని పేర్కొన్నారు.

ఈ ఆలయ కూల్చివేత ఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వం వెంటనే స్వతంత్ర, పారదర్శక విచారణ జరిపి, బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టాలి. ధ్వంసమైన ఆలయాన్ని పూర్వ రూపంలో పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి. దేశంలోని మైనార్టీ పౌరులు, వారి సాంస్కృతిక వారసత్వ సంపద, ప్రార్థనా మందిరాల భద్రతను రక్షించే ప్రాథమిక బాధ్యతను పాక్ నెరవేర్చాలి. పాకిస్థాన్‌లో మైనార్టీల ప్రార్థనా స్థలాలపై దాడులు వరుసగా జరుగుతుండటంపై హక్కుల సంఘాలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us