చిన్నారి గీసిన చిత్రపటానికి ముగ్ధుడైన ప్రధాని.. ఏం చేశారంటే..?
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో గురువారం ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ తనకు పెయింటింగ్ బహుమతిగా ఇచ్చిన చిన్నారితో ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా సంభాషించారు. పాపను ఆశీర్వదించిన ప్రధాని.. పెయింటింగ్ వెనుకవైపున చిరునామాను రాసి ఇవ్వాలని కోరారు. తిరిగి ఆ చిన్నారికి లేఖ రాస్తానన్నారు మోదీ.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. కాగా, గురువారం (నవంబర్ 2) ప్రధాని నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో ప్రచారం నిర్వహించారు. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని స్పీచ్ ఇస్తున్న సమయంలో జనం మధ్యలో నుంచి తాను గీసిన మోదీ చిత్రాన్ని చూపించేందుకు ప్రయత్నించింది. ప్రధాని మోదీ ఆ పాపను గమనించి.. సమాధానమిచ్చారు. వేదికపై నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “బిడ్డా, నేను నీ చిత్రాన్ని చూశాను. ఎంతో గొప్పగా గీశావు. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. కానీ నువ్వు చాలా సేపు నిలబడే ఉండి అలసిపోయావు. కూర్చో” అని ప్రధాని వ్యాఖ్యానించారు. అక్కడ ఉన్న పోలీసులకు ఆ పాప గీసిన చిత్రాన్ని తనకు ఇవ్వాలని కోరారు. దానిపై చిరునామా రాసి ఇవ్వాలని ఆ పాపకు ప్రధాని సూచించారు. తిరిగి తాను తప్పకుండా చిన్నారికి లెటర్ రాస్తానన్నారు మోదీ. దీంతో సభకు హాజరైన ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
అనంతరం భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని చూశారని, ఈ ఐదేళ్లలో కాంగ్రెస్ నేతల ఇళ్లు, భవనాలు, వాహనాలు మాత్రమే అభివృద్ధి చెందాయన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ తుపాన్- ప్రధాని
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని విస్మరించిందని, కానీ ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి తాము అన్ని చర్యలు తీసుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రతి పేద, గిరిజన, వెనుకబడిన వర్గాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ తుఫాన్ వీస్తుందని చెప్పారు.
ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్ నాయకత్వంలో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అక్కడ మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో జరుగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..