జలదిగ్బంధంలో వరంగల్.. చెరువులుగా మారిన కాలనీలు
మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో కురిసిన భారీ వర్షాలకు వరంగల్ - హనుమకొండలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి ఓరుగల్లు.. హోరుగల్లుగా మారింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కుండపోత వర్షం కురిసింది. ఊళ్లూ, వాగులు ఒక్కటయ్యాయి.. రహదారులు ఏరులయ్యాయి.. వాహనాలు కొట్టుకుపోయాయి.. ఇళ్లు, చెట్లు కూలిపోయాయి.
ఉమ్మడి వరంగల్ మొత్తం అతలాకుతలమయింది. హైదరాబాద్-వరంగల్ హైవే మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రధానంగా వరంగల్ నగరంతో పాటు హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్-హనుమకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్డులో బొంది వాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భద్రకాళి ఆలయానికి రాకపోకలు బంద్ అయ్యాయి. ఆలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు రోడ్డు జలమయమైంది. వరంగల్ తూర్పు పరిధిలో ఆరు పునరావాస కేంద్రాలను నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటుచేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు విపత్తు నిర్వహణ సిబ్బంది తరలించారు. ములుగు రోడ్డు వద్ద నాలా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్‌ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేశ్ కాలనీలోని ఇళ్లల్లోకి వరదనీరు చేరుకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండ పరిధిలోని వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరుతోంది. దీంతో జవహర్ కాలనీ, గోపాల్‌పూర్, 100 ఫీట్ల రోడ్డు జలమయమయ్యాయి. కాజీపేట నుంచి హనుమకొండ మార్గంలోని సోమిడి, గోపాల్‌పూర్ చెరువులు నిండిపోవడంతో కట్టలు తెగిపోయాయి. భారీగా వరద నీరు రోడ్డు పైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వివేక్ నగర్, అమరావతి నగర్, ప్రగతి నగర్ కాలనీలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో కార్లు, బైక్‌లు జల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 42 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రోడ్లన్నీ కాలువలుగా మారగా.. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. పలు కాలనీల్లో వరద ఉధృతికి పలుచోట్ల కార్లు, బైక్‌లు కొట్టుకుపోయాయి. రోడ్లన్నీ జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. వరదనీరు ముంచెత్తడంతో చెరువును తలపిస్తోంది హనుమకొండ బస్టాండ్. హనుమకొండ నెహ్రూ స్టేడియం చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ నీట మునిగాయి. హనుమకొండలోని వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరింది. హనుమకొండలోని జవహర్‌కాలనీ, గోపాల్‌పూర్, హండ్రెడ్ ఫీట్ రోడ్, వివేక్‌నగర్, అమరావతినగర్, ప్రగతినగర్ కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. కాజీపేట, హనుమకొండలో సోమిడి, గోపాల్‌పూర్ చెరువులు నిండిపోవడంతో కట్టలు తెగిపోయాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేపల కోసం వల వేసిన జాలరి.. ఆ వలలో చిక్కింది చూసి షాక్
భారీగా నగలు ధరిస్తే.. రూ. 50 వేలు జరిమానా !
ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయా ??
సడెన్‌గా బ్లూ కలర్‌లోకి మారిన వీధికుక్కలు.. ఎక్కడంటే ??
చెట్టెక్కి కొట్టుకున్న సింహం-చిరుత.. తర్వాతి సీన్ చూస్తే నవ్వాగదు
