మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన నాయకుడు తానాజీ సావంత్ కుమారుడు రిషిరాజ్ ఫిబ్రవరి 10న రాత్రి వేళ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రత్యేకంగా ఓ ఛార్టర్డ్ విమానాన్ని బుక్ చేసుకొని బ్యాంకాక్ బయల్దేరారు. హమ్మయ్య దాటేశాం.. ఇంక మనల్నెవ్వరూ ఆపరు.. అంతా బాగానే ఉంది…అనుకునేలోపు..ఊహించనివిధంగా విమానం ఎక్కిన చోటుకే వచ్చి ల్యాండ్ అయ్యింది. పూణె ఎయిర్‌పోర్టు నుంచి వారిని తీసుకెళ్లిన ఛార్టర్డ్ విమానం మార్గమధ్యంలో ఉండగా.. తన కుమారుడిని కిడ్నాప్ చేశారంటూ తానాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు డీజీసీఏ సాయంతో విమానాన్ని వెనక్కి రప్పించారు. అప్పటికే అండమాన్ వరకు వెళ్లిన ఆ విమానం వెనక్కి మళ్లింది.