పోలీస్‌స్టేషన్‌లోనే రివాల్వర్‌తో..కాల్చుకుని ఎస్‌ఐ బలవన్మరణం! వీడియో

పోలీస్‌స్టేషన్‌లోనే రివాల్వర్‌తో..కాల్చుకుని ఎస్‌ఐ బలవన్మరణం! వీడియో

Samatha J

|

Updated on: Feb 01, 2025 | 1:00 PM

డ్యూటీలో ఉన్న ఓ ఎస్‌ఐ పోలీస్‌ స్టేషన్‌లోనే సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చోటు చేసుకుంది. ఎస్సై ఏజీఎస్‌ మూర్తి తణుకు రూరల్‌ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. గేదెల అపహరణ కేసులో ఎస్సై మూర్తిపై పలు ఆరోపణలు రావడంతో ఆయన్ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

ప్రస్తుతం ఆయన వీఆర్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఎస్సై మూర్తి స్టేషన్‌కు వచ్చారు. పెనుగొండలో సీఎం పర్యటన బందోబస్తుకు వెళ్లే క్రమంలో స్టేషన్‌కు వచ్చిన ఆయన కొంతసేపు కూర్చొని.. ఆ తర్వాత బాత్‌రూమ్‌లోకి వెళ్లి.. తన సర్వీస్‌ తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. దీంతో అప్రమత్తమైన పోలీసు సిబ్బంది ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న కుటుంబసభ్యులు మూర్తి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్‌ఐ ఆత్మహత్య ఘటన…జిల్లాలో సంచలనం రేకెత్తించింది.