Konaseema: అచ్చమైన, స్వచ్ఛమైన కోనసీమవారి పెళ్లి.. మీరు చూసి తీరాల్సిందే..

|

Apr 07, 2024 | 3:51 PM

ప్రాంతాలు వేరైనా, సంప్రదాయాలు భిన్నమైనా.. పెళ్లి పరమార్థం మాత్రం ఒక్కటే. పెళ్లి అనే శుభకార్యంతో రెండు మనసులు ముడిపడి, రెండు కుటుంబాలు ఏకమై.. కొత్త బంధం..బంధుత్వంతో జీవనం కొత్త మలుపు తిరుగుతుంది. అయితే ఈ వివాహాలు సంప్రదాయానికి కొత్త ట్రెండ్‌ను యాడ్‌ చేసి సరికొత్త పద్ధతిలో చేసుకుంటున్నారు నేటి తరంవారు. తమ వివాహాన్ని నూరేళ్లు గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజాగా కోనసీమ జిల్లాలో జరిగిన ఓ వివాహం అందరినీ ఆకట్టుకుంటోంది. 

పూర్వం పెళ్లి సమయంలో వధూవరులను పల్లకిలో ఊరేగిస్తూ వధువు లేదా వరుడి ఇంటికి తీసుకెళ్లేవారు. నలుగురు బోయీలు ఒహోం ఒహోం అంటూ పల్లకిని మోసుకెళ్తుంటే అందరూ వీధుల్లోకి వచ్చి వరుడు ఎలా ఉన్నాడోనని చూసేవారు. మరోసారి అలాంటి పెళ్లిని గుర్తుచేశారు రాయుడివారి పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె. అంబేద్కర్‌ కోసీమజిల్లా, పి.గన్నవరం మండలం చాకలిపాలెంలో రాజుల కాలంనాటి పెళ్లిని తలపించింది మోహన్‌, సౌమ్యల వివాహం. నెమలిని పోలిన పల్లకిలో వధూవరులను కూర్చోబెట్టి, మేళతాళాలు, సన్నాయిమేళాలతో ఊరేగించారు. బుట్బొమ్మలు, వివిధ వేషధారణలతో చూపరులను ఆకట్టుకున్నాయి రాయుడివారి పెళ్లి ఏర్పాట్లు. డీజే సౌండ్లు, డాన్సులతో మోత మోగించకుండా సంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ.. ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు. ఈ వివాహ వేడుక ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కోనసీమవారి పెళ్లా.. మజాకా అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

 

Follow us on