వరదలో కొట్టుకుపోయిన కుటుంబం.. ప్రాణాలతో బయటపడిన 11 నెలల పాప వీడియో
భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఒక వ్యక్తి, అతడి భార్య, అత్త కొట్టుకుపోయారు. అయితే ఆ ఇంట్లో నిద్రిస్తున్న 11 ఏళ్ల పసి పాప ఒక్కతే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఇది చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం అర్ధరాత్రి వేళ భారీ వర్షం కురిసింది. వర్షపు నీరు ఒక ఇంట్లోకి ప్రవేశించింది. అందులో నివసించే రమేష్ కుమార్, అతడి భార్య రాధా దేవి, అత్త పూనమ్ దేవి కలిసి ఇంటి బయటకు వచ్చారు. ఇంట్లోకి వర్షం నీరు రాకుండా మళ్లించేందుకు ప్రయత్నించారు.
11 నెలల పసి పాప ఒక్కతే ఆ ఇంట్లో నిద్రపోతుంది.ఉన్నట్టుండి ఆ ఇంటి సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇంటి బయట వర్షం నీటిని మళ్లిస్తున్న ఆ ముగ్గురు కొట్టుకుపోయారు. పొరుగువారు దీనిని గమనించారు. అయితే సహాయం చేయలేక తమ ఇళ్లలోకి వెళ్లిపోయారు. తెల్లవారుజామున 2 గంటలకు ఆ ఇంటికి వచ్చి చూశారు. లోపల నిద్రిస్తున్న పాప ఒక్కతే వారికి కనిపించింది. దీంతో ఆ కుటుంబానికి చెందిన బంధువులకు సమాచారం ఇచ్చారు.మరోవైపు ఆ చిన్నారి బంధువులు తెల్లవారుజామున ఆ ఇంటికి చేరుకున్నారు. గల్లంతైన ముగ్గురి కోసం వెతికారు. ఒకచోట రమేష్ మృతదేహాన్ని గుర్తించారు. పసి పాప తల్లి, అమ్మమ్మ మృతదేహాలు లభించలేదు. రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకున్నారు. తల్లిదండ్రులు, అమ్మమ్మను కోల్పోయి ఒంటరైన ఆ పసి పాపను ఎత్తుకున్నారు. ఆ చిన్నారిని పెంచేందుకు చాలా మంది ముందుకు వచ్చినట్లు ఆ పాప తండ్రి రమేష్ సోదరుడు తెలిపారు. అయితే ఆ చిన్నారిని తామే పెంచుతామని ఆయన చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం :