కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..

Updated on: Dec 22, 2025 | 6:06 PM

వంగపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు నెలల క్రితం వివాహమైన నవదంపతులు, సింహాచలం, భవాని రైలు నుండి జారిపడి మృతి చెందారు. బంధువుల ఇంటికి వెళ్తుండగా సికింద్రాబాద్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ నుండి ప్రమాదవశాత్తూ పడిపోవడంతో ఈ విషాదం జరిగింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.

పెద్దల సమక్షంలో రెండు నెలల క్రితం అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కోటి ఆశలతో దాంపత్య జీవితం ప్రారంభించారు. కొత్త కాపురం సంతోషంగా సాగుతోంది. ఇంతలో విధి వక్రించింది. ఊహించని ప్రమాదం నవజంటను మింగేసింది. ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగింది. బంధువుల ఇంటికి వెళ్లేందుకు రైలు ఎక్కిన ఆ భార్యాభర్తలు ప్రమాదవశాత్తూ కిందపడి ప్రాణాలు కోల్పోయారు. డిసెంబరు 18 అర్ధరాత్రి వంగపల్లి స్టేషన్ సమీపంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లా రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం హైదరాబాద్ లోని ఓ కెమికల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండు నెలల క్రితం మన్యం జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవానితో సింహాచలం వివాహం జరిగింది. నవ దంపతులు హైదరాబాద్‌ జగద్గిరిగుట్టలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లడానికి సింహాచలం, భవాని గురువారం రాత్రి సికింద్రాబాద్ లో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. రైలు రద్దీగా ఉండటంతో వారు డోర్ దగ్గర నిలబడ్డారు. రైలు వంగపల్లి రైల్వేస్టేషన్‌ దాటిన తర్వాత ప్రమాదవశాత్తూ ఇద్దరూ జారిపడి మృతి చెందారు. శుక్రవారం ఉదయం ట్రాక్‌మెన్‌ గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండు నెలల ఆపరేషన్‌ సక్సెస్‌.. బోనులో చిక్కిన మ్యాన్‌ ఈటర్‌

అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే

T20 వరల్డ్‌కప్‌కు టీమిండియా ఆటగాళ్లు వీరే

అర్ధరాత్రి కారు బీభత్సం.. ఆ తర్వాత

అద్భుతం.. పద్మావతి అమ్మవారికి పసుపు కొమ్ముల అలంకరణ