హైబీపీ ఉందని ఎలా తెలుసుకోవచ్చు? వీడియో
దేశంలో అధిక రక్తపోటుతో బాధపడేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు హైబీపీ అటాక్ చేస్తోంది. ఒత్తిడి, చెడు జీవనశైలి కారణంగా హైబీపీ త్వరగా అటాక్ అవుతుంది. ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. ఇది నెమ్మదిగా అధిక రక్తపోటుకు కారణమవుతుంది. హై బీపీ వ్యాధి శరీరంలోని అనేక భాగాలను దెబ్బతీస్తుంది.
రక్తపోటు నియంత్రణలో లేకపోతే గుండెపోటు, పక్షవాతం, గుండె వైఫల్యం, కిడ్నీ జబ్బులు, విషయ గ్రహణ సామర్థ్యం క్షీణించటం, మతిమరుపు వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధిక రక్తపోటుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుతం రక్తనాళాలు మూసుకుపోవడం, పక్షవాత లక్షణాలు, మధుమేహం, కిడ్నీజబ్బులు, ఊబకాయం వంటి ముప్పు కారకాలుండి.. వచ్చే పదేళ్లలో గుండెజబ్బు వచ్చే అవకాశం 10% కన్నా ఎక్కువగా ఉన్నవారికి రక్తపోటు 130/80 కన్నా మించితే డాక్టర్లు మందులు మొదలెడుతున్నారు. మిగతావారికి రక్తపోటు అదేపనిగా 140/90 కన్నా ఎక్కువుంటే మందులిస్తున్నారు. 130/80 నుంచి 140/90 మధ్యలో ఉన్నవారికి జీవనశైలి మార్పులే సూచిస్తున్నారు. అయితే వీరి విషయంలో మరింత శ్రద్ధ అవసరమని.. జీవనశైలి మార్పులతో 3-6 నెలల్లో ఎలాంటి ఫలితమూ కనిపించకపోతే మందులు మొదలెట్టాలని కొత్త మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఇప్పటివరకూ 140/90 దాటినవారికి ఒక మందుతో మొదలెట్టి, రక్తపోటు తగ్గకపోతే మోతాదు పెంచుతున్నారు. అప్పటికీ ఫలితం లేకపోతే రెండో మందు జత చేస్తున్నారు. వీరికి మొదట్నుంచే రెండు మందులను ఆరంభించాలని కొత్త మార్గదర్శకాలు చెబుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
